సంఘమిత్రల విలువ ప్రభుత్వానికి తెలిసి వచ్చింది

17 Aug, 2018 12:01 IST|Sakshi
తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

వెట్టిచాకిరి చేయించుకుని     వదిలివేశారు

అంగీకారంతోనే నగదు బదిలీ చేశాం

మ్యాక్స్‌ చట్టం ప్రకారం వారికి తీసుకునే హక్కు ఉంది

మా ప్రయత్నం వల్లే వారికి         త్వరలో జీతాలు వస్తాయి

సాయం చేయడంలో         పోటీ ఉండడం లేదు

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి  

తిరుపతిరూరల్‌: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంఘమిత్రలను ఆదుకునేందుకు తమ కుటుంబం చేసిన నగదు బదిలీ వల్ల వారి విలువ ప్రభుత్వానికి తెలిసి వచ్చిందని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 20 ఏళ్లుగా రాత్రి అనక  పగలనక ప్రభుత్వం అప్పగించిన 16 రకాల పనులను  ఎవరు చెప్పినా కాదనుకుండా  ఆరోగ్యం పాడయ్యేలా సంఘమిత్రలు పనిచేస్తున్నారన్నా రు. వారికి ఈరోజు కూడా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం అందిన పాపాన పోలేదన్నా రు. మ్యాక్స్‌ చట్టం ప్రకారం వారికి ఎవరినుంచైనా విరాళం తీసుకునే హక్కు, అధికారం ఉందన్నారు.

మాకష్టార్జితం నుంచి వారికి చట్టం ప్రకారమే 175 మంది సంఘమిత్రలకు కేవలం రూ.3.50లక్షలు మాత్రమే బదిలీ చేశామన్నారు. అందరితో చర్చించి వారి ఆమోదంతోనే వారి వ్యక్తిగత ఖాతాలకు ఈ నగదు బదిలీ చేసినట్టు తెలిపారు. ఈనెల 4న బదిలీ చేశామని, వారికి తెలియకుండా బదిలీ అయివుంటే 5వ తేదీనే సంఘమిత్రలు  తనను తప్పుపట్టి ఉండేవారని తెలిపారు. 16వ తేదీ వరకు వ్యతిరేకించకుండా ఉండేవారు కాదన్నారు. వాళ్లకు తనకు ఆత్మీయ అనుబంధం ఉందని ఒక సోదరుడిగా నాలుగేళ్లుగా వారికి పసుపు, కుంకుమ, నూతన బట్టలను పెడుతున్నట్టు గుర్తు చేశారు. అందులో భాగంగానే ఈ నగదు బదిలీ సాయం చేశానన్నారు.

సాయంలో పోటీ ఉండాలి..
ఆర్థిక ఇబ్బందులతో కష్టాల్లో ఉన్న ఆడపడుచులకు సాయం అందించి వారి అభిమానాన్ని సంపాదించుకోవ డంలో పోటీ ఉండాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి సూచించారు. తనకన్నా ఆర్థికంగా ధనవంతులైన వారు సంఘమిత్రలకు తనకన్నా ఎక్కువగా రూ.10వేలు సాయం అందించినట్లు అయితే తాను కూడా అభినందించేవాడినని పేర్కొన్నారు. నాయకుడు అనే వారికి పెద్ద మనసు, పెద్దరికం ఉండాలన్నారు. చిన్నపిల్లలకన్నా తక్కువ స్థాయిలో ఆలోచించడం, గోల చేయడం నాయకత్వ లక్షణాలు కావన్నారు.

నా నిర్ణయంతో సంఘమిత్రలకు త్వరలో జీతాలు
ఏళ్ల తరబడి సంఘమిత్రలను పనిచేసే కూలీలుగా చూశారే తప్ప మనుషులుగా ఏనాడు చూడలేదని ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునేందుకు తమ కుటుంబం చేసిన నగదు బదిలీతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. వారి వ్యక్తిగత ఖాతాల్లో జరిగిన నగదు బదిలీని వెనక్కి ఇవ్వాలని అధికార పార్టీ నాయకులను సంఘమిత్రలను ప్రాధేయపడడం, మేమే జీవో ఇస్తాం, జీతాలు ఇస్తామంటూ వేడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  భవిష్యలో కూడా పార్టీలకు అతీతంగా సంఘమిత్రలకు తనవంతు చేతనైనంత సాయం చేస్తూనే ఉంటానన్నారు.

మరిన్ని వార్తలు