ఛత్తీస్‌ రెండో దశలో 71.93% పోలింగ్‌

21 Nov, 2018 02:37 IST|Sakshi
జష్పూర్‌ జిల్లాలోని సంగ్వరీ పోలింగ్‌ కేంద్రం వద్ద మహిళా ఓటర్ల పిల్లల కోసం ప్లే హౌజ్‌ను ఏర్పాటుచేసిన దృశ్యం

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన రెండో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం 71.93 శాతం ఓటింగ్‌ నమోదైందని డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ఉమేశ్‌ సిన్హా తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగగా మావోయిస్టుల ప్రభావిత గరియాబంద్‌ జిల్లా బృందానవ్‌గఢ్‌ నియోజకవర్గంలోని రెండు పోలింగ్‌ బూత్‌లలో మాత్రం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 3 గంటలకే ముగిసింది.

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, ఆయన భార్య వీణ, కుమారుడు అభిషేక్‌ కువర్థా నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. పలు ఫిర్యాదులు రావడంతో బిలాస్‌పూర్‌ జిల్లా మర్వాహి నియోజకవర్గంలోని ప్రిసైడింగ్‌ అధికారితోపాటు సిబ్బంది ఒకరిని విధుల నుంచి తప్పించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు. ఫలితాలు డిసెంబర్‌ 11న వెలువడనున్నాయి.

మరిన్ని వార్తలు