సిగ్గుమాలిన ప్రభుత్వ చర్య: ప్రియాంక ఫైర్‌

21 Aug, 2019 10:52 IST|Sakshi

చిదంబరంపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు

తామంతా అండగా ఉంటాం: ప్రియాంక

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజకీయ కక్ష్యసారింపు చర్యలో​ భాగంగా చిదంబరాన్ని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘రాజకీయ విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తి చిదంబరం. కేంద్ర హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేశారు. బీజేపీ ప్రభుత్వ తప్పిదాలపై ఆయన మాట్లాడినందుకు కుట్రపూరితంగా కేసుల్లో ఇరికేంచే  ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సిగ్గుమాలిన చర్యఇది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా చిదంబరానికి అండగా ఉంటామని, న్యాయం కోసం పోరాటం చేస్తామని ప్రియాంక స్పష్టం చేశారు.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తోందనీ, ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అవినీతి, నగదు అక్రమ చలామణి కేసుల్లో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో చిదంబరంను అరెస్టు చేసేందుకు సీబీఐ, ఈడీలకు మార్గం సుగమమైంది. మంగళవారం రాత్రే సీబీఐ, ఈడీ అధికారుల బృందాలు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి చేరుకోగా.. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని సమాచారం. 3రోజుల్లో తాము సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నాననీ, అంతవరకు తనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలని చిదంబరం కోరినా హైకోర్టు ఒప్పుకోలేదు. దీంతో ముందస్తు బెయిలు కోసం సుప్రీంకోర్టులో బుధవారమే అత్యవసర విచారణ కోరాలని చిదంబరం లాయర్లు నిర్ణయించారు.


 

మరిన్ని వార్తలు