చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు దారుణం: శ్రీకాంత్‌ రెడ్డి

15 Dec, 2019 15:34 IST|Sakshi

ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి హితవు 

అసెంబ్లీలో బాబు వ్యవహార శైలి దారుణంగా ఉంది 

ప్రజా సమస్యలపై చర్చ పెడితే టీడీపీ సభ్యులు పారిపోతున్నారు 

సాక్షి, అమరావతి: చీఫ్‌ మార్షల్‌ను దూషించినందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పి శాసనసభకు వస్తే çహుందాగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు. అసెంబ్లీలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను తప్పుదోవ పట్టించేలా టీడీపీ వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే గొల్ల బాబురావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులను ఉద్దేశించి చంద్రబాబు, నారా లోకేశ్‌  నోటికొచ్చినట్లు మాట్లాడారని గుర్తుచేశారు. మార్షల్స్‌ను దారుణంగా తిట్టిన చంద్రబాబు తిట్టలేదంటూ అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని తప్పుపట్టారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెడితే టీడీపీ సభ్యులు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. సభలో టీడీపీ మాట్లాడటానికి సమస్యలు లేక సభను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. చివరి రెండు రోజులైనా సభ సజావుగా జరిగేందుకు బాబు సహకరించాలని అన్నారు.
 
కులాల మధ్య చిచ్చుపెడుతున్న బాబు 
చరిత్ర సృష్టించే విధంగా, దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళా రక్షణ బిల్లును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇమేజ్‌ పెరిగితే మనుగడ ఉండదని కొందరు భయపడుతున్నారని చెప్పారు. అందుకే సీఎం ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని చెప్పారు. మతాల మధ్య చిచ్చుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఖాళీగా ఉండి ఎల్లో మీడియాలో ఇష్టానుసారంగా వార్తలు రాయిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

చంద్రబాబు ఓ ఉన్మాది: గొల్ల బాబురావు 
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓ ఉన్మాది అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి చంద్రబాబు మరొకరిని ఉన్మాది అనడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో ఆయన తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. గత ఐదేళ్లలో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. బాబుకు వయసు పెరిగింది గానీ మనసు పెరగలేదన్నారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన ఏనాడు ఆలోచించలేదని దుయ్యబట్టారు. కార్పొరేట్‌ శక్తులకు చంద్రబాబు విచ్చలవిడిగా దోచిపెట్టారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు