‘లోకేశ్‌ను ఎలా మంత్రిని చేశారు’

19 May, 2018 03:01 IST|Sakshi
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌

చంద్రబాబుపై చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుడు రంగరాజన్‌ ధ్వజం

మొయినాబాద్‌(చేవెళ్ల): ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు ఏ అర్హత ఉందని మంత్రిని చేశారని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. టీటీడీ పాలకమండలికి చట్టాలపై అవగాహన లేదన్నారు. తిరుమలపై ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం చిన్న ఆలయాలపై పడుతుందన్న విషయాన్ని టీటీడీ గుర్తించాలన్నారు.

ఎండోమెంట్‌ యాక్ట్‌ని సవరించ కుండా రిటైర్మెంట్‌ చేయడానికి వీలులేదని, ధార్మిక పరిషత్‌ ఇచ్చిన రిజల్యూషన్‌ ను ట్రస్టు బోర్డు కొట్టేయడానికి వీలులేదన్నారు. వంశ పారంపర్యంగా తండ్రి తరువాత కొడుకు అర్చకత్వం నిర్వహించవద్దని చెబుతున్న చంద్రబాబు ఆయన కుమారుడిని మాత్రం వారసత్వంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారని మండి పడ్డారు. ‘అర్చక వ్యవహారాల్లో మీరు వేలు పెట్టారు కాబట్టి మేం మిమ్మల్ని ప్రశ్నలడుగుతాం. మీకు రాజకీయమెందుకని అడుగుతాం.. రాజకీయ నాయకుడు మా దగ్గరకొస్తే మేం రాజకీయ నాయకుడి దగ్గరకొస్తాం’ అని బాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు