ఎమ్మెల్సీగా డాక్టర్‌ తేరా చిన్నపరెడ్డి విజయం

4 Jun, 2019 11:05 IST|Sakshi
చిన్నపరెడ్డికి ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎట్టకేలకు తేరా చిన్నపరెడ్డి కల నిజమైంది. చట్టసభల్లోకి అడుగు పెట్టాలని ఆయన ఇప్పటికి నాలుగు సార్లు ప్రయత్నించగా, మూడు సార్లు వెక్కిరించిన ఫలితం.. నాలుగోసారి ఆయన సొంతమైంది. దీంతో నల్లగొండ స్థానిక సంస్థల శాసన మండలి స్థానం టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరింది. ఆ పార్టీ నుంచి ఎన్ని కల బరిలో నిలిచిన డాక్టర్‌ తేరా చిన్నపరెడ్డి 226 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిపై విజయం సాధించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎక్స్‌–అఫీషియో సభ్యులు అంతా కలిపి 1,085 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గానికి గత నెల 31వ తేదీన పోలింగ్‌ జరగగా.. 1,073 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలకు  సంబంధించి సోమవారం ఓట్లను లెక్కించారు. మొత్తం పోలైన ఓట్లలో  19 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఎన్నికల్లో చెల్లిన 1054 ఓట్లలో సగానికిపై అంటే.. 528 ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు. కాగా, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 640, కాంగ్రెస్‌కు 414 ఓట్లు పోలయ్యాయి. దీంతో 226 ఓట్ల మెజారిటీతో  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌కు తొలి రౌండ్‌లోనే గెలుపునకు అవసరమైన ఓట్ల కంటే ఎక్కువే వచ్చాయి. మొదటి రౌండ్‌లో వెయ్యి ఓట్లు లెక్కించగా ఆయనకు 601 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో మిగిలిన 73 ఓట్లను లెక్కించారు. మొత్తంగా టీఆర్‌ఎస్‌కు 640 ఓట్లు రావడంతో విజేతగా ప్రకటించారు.

ఎన్నాళ్లో.. వేచిన ఉదయం
చట్టసభల్లో అడుగు పెట్టాలని తేరా చిన్నపరెడ్డి పదేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున నాగార్జున సాగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మరోమారు టీడీపీ నుంచే.. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీపడ్డారు. ఆ ఎన్నికల్లో తేరా రెండో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఎంపీగా విజయం సాధించగా, టీఆర్‌ఎస్‌ మూడో స్థానంలో నిలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఆయన టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు.

2015 డిసెంబర్‌లో నల్లగొండ స్థానిక సంస్థల మండలి నియోజకవర్గానికి ఎన్నికలు రాగా, టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ సాధించి పోటీ చేశారు. అయితే, మూడోసారి కూడా ఆయనను విజయం వరించలేదు. నాటి ఎన్నికల్లో తేరా చిన్నపరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 192 ఓట్లు ఆధిక్యం వచ్చింది. మరో మూడేళ్ల పదివీ కాలం మిగిలి ఉండగానే, రాజగోపాల్‌ రెడ్డి మొన్నటి శాసన సభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జరిగిన ఈ ఎన్నికల్లో విజయం తేరాకు దక్కింది. ఈ సారి ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌  తేరా చిన్నపరెడ్డినే పోటీకి నిలబెట్టగా.. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మిని పోటీకి పెట్టారు. 2015లో దక్కకుండా పోయిన ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌ ముందునుంచీ వ్యూహాత్మకంగానే వ్యవహరించి అనుకున్న ఫలితాన్ని సాధించింది. దీంతో పదేళ్లుగా మూడు ఎన్నికల్లో చేదు ఫలితాలను అనుభవించిన తేరా చివరకు నాలుగో ప్రయత్నంలో ఎమ్మెల్సీగా విజయం సాధించారు.

మరిన్ని వార్తలు