-

మీ అంతు చూస్తా.. జైల్లో పెట్టిస్తా..

10 Apr, 2019 11:09 IST|Sakshi

చింతమనేని వ్యాఖ్యల వీడియో హల్‌చల్‌

మొదటి నుంచి దుందుడుకు వైఖరే  

ప్రజలు, అధికారులు, దళితులపైనా దౌర్జన్యాలు

సీఎం అండతో రెచ్చిపోతున్న వైనం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పెదపాడు మండలంలో ప్రభుత్వ ఉద్యోగులపై చిందులు తొక్కిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ‘నా కొడకల్లారా మీ అంతు చూస్తా..తేడా వచ్చిందో కేసుల్లో ఇరికించి జైలులో పెట్టిస్తా’ అంటూ బెదిరింపులకు దిగారు. ఈ వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతమంది విద్యుత్‌ శాఖ అధికారులు జనాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఓ మహిళ చింతమనేని ప్రభాకర్‌ దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన అధికారులను బండ బూతులు తిట్టారు. ఈ ఘటన ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చింతమనేనిపై ఏకంగా 26 కేసులు ఇప్పటికీ నడుస్తుండగా, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌పై దౌర్జన్యం చేసిన  కేసులో కోర్టు  రెండేళ్ల  శిక్ష కూడా విధించింది. ఆయనపై ఏలూరు పట్టణ 3వ టౌన్‌ పీఎస్‌లో నేటికీ రౌడీషీటు ఉంది.

దౌర్జన్యాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. 
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రజాప్రతినిధిగా  కాకుండా రౌడీలా వ్యవహరిస్తూ ఉంటారనే విమర్శలున్నాయి. కృష్జాజిల్లా  ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై దౌర్జన్యం, ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీశాఖ అధికారిపై దాడి, ఐసీడీఎస్‌ అధికారులకు బెదిరింపులు, ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించాయి. అలాగే అంగన్‌వాడీ కార్యకర్తలను దుర్బాషలాడటం, పోలీస్‌ కానిస్టేబుల్‌ మధును చితక్కొట్టడం, అటవీశాఖ అధికారిని బలవంతంగా సెలవుపై పంపడం, ఇటీవల కొల్లేరు వివాదాస్పద భూముల్లో చేపలు పట్లే అంశంలో జిల్లా ఎస్పీపై నోరుపారేసుకోవడం, గుండుగొలను జంక్షన్‌లో ట్రాఫిక్‌ మళ్లింపు విధులు నిర్వహిస్తున్న కొవ్వూరు ఏఎస్‌ఐ, సీపీవోలపై దాడి,  ఇళ్ల స్థలాలు, పొలాలు గొడవల పేరుతో దాడులు చేయడం పరిపాటిగా మారింది. 

సీఎం అండతోనే..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అండతోనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ కొఠారు అబ్బయ్య చౌదరి, తదితరులపై  సెక్షన్‌ 341, 323, 506 కింద అక్రమ కేసులు బనాయించారు. అలాగే ఇసుక అక్రమంగా తరలింపును అడ్డుకున్న కృష్జాజిల్లా ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి పక్కకిలాగి పడేశాడు. ఉద్యోగ సంఘాలు సైతం వనజాక్షికి మద్దతు తెలపడంతో ఏకంగా  చంద్రబాబు జోక్యం చేసుకుని సెటిల్‌మెంట్‌ చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. హమాలీ కూలీల ముఠా నాయకుడు రాచీటి జాన్‌పైనా దాడి చేశాడు. పెదవేగి మాజీ సర్పంచిని ఎంఎల్‌ఎ నివాసంలో గన్‌మెన్‌లు చేతులు వెనక్కి విరగదీసి పట్టుకోగా ఎమ్మెల్యే ప్రభాకర్‌ బూటుకాలుతో పొట్టలో, తలపై తన్నడంతో కృష్ణారావు తీవ్రంగా గాయపడ్డాడు. ఇటీవల అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులను బెదిరించడం చర్చనీయాంశమయ్యింది.  

మరిన్ని వార్తలు