ఆయన్ను నమ్మినందుకు చెప్పులు పడ్డాయ్‌: మంచు

7 Apr, 2019 18:37 IST|Sakshi

తిరుపతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై మరోసారి సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత మంచు మోహన్‌ బాబు మండిపడ్డారు. తిరుపతిలో మోహన్‌ బాబు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ మరణానికి మూమ్మాటికీ కారకుడు నారా చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. చంద్రబాబు నాయుడి మాయ మాటలు నమ్మినందుకు తన మీద చెప్పులు పడ్డాయని తెలిపారు. అనంతరం తన తప్పు తాను తెలుసుకుని ఎన్టీఆర్‌ను కలిశానని చెప్పారు. ఎన్టీఆర్‌ చనిపోయిన తర్వాత ఒక్కసారి మాత్రమే బీజేపీకి ప్రచారం చేసిన తాను తర్వాత రాజకీయాల్లోకి రాలేదని వ్యాఖ్యానించారు. 2009లో వైవీఎస్‌ చౌదరీకి చెక్‌ ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. రాష్ట్రంలో మొట్టమొదట ఫీజురీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ లాంటి పది మంచి పథకాలను ప్రవేశపెట్టిన మహానేత వైఎస్‌ఆర్‌ అని కొనియాడారు.

పదేళ్లు ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ సుదీర్ఘ పాదయాత్ర చేసిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని ప్రశంసించారు. వైఎస్‌ఆర్‌ ఆశయాలను, ప్రజల సమస్యలను నెరవేర్చడానికి పోరాడుతోన్న వ్యక్తి వైఎస్‌ జగనేనన్నారు. వైఎస్‌ కుటుంబానికి, మంచు ఫ్యామిలీకి బంధుత్వం ఉందన్నారు. చంద్రబాబు మూర్ఖుడని, అతని స్థాయి ఏంటి, తన స్థాయి ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు ఆస్తి ఏంటి, తన ఆస్తి ఏంటి..బాబు ఎలా సంపాదించాడో ప్రజలకు తెలుసునన్నారు. చంద్రగిరి బహిరంగ సభలో తనను ఎవరు అంటావా నీచుడా అని పరోక్షంగా బాబునుద్దేశించి తీవ్రంగా ఏకిపారేశారు. ఓటుకు నోటు కేసులో భయంతో హైదరాబాద్‌ వదిలి పారిపోయిన సీఎం చంద్రబాబేనని గుర్తు చేశారు. కేసీఆర్‌ కాళ్లు కడిగిన నీళ్లు నెత్తిన పోసుకునేది చంద్రబాబేనన్నారు. చంద్రబాబుకు ఓటమి తప్పదు.. జగన్‌ సీఎం అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. 

కులాల మధ్య చిచ్చుపెట్టిన దుర్మార్గుడు బాబు

ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తిని తన జీవితంలో చూడలేదన్నారు. తాను, కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ కలిసి కుట్రల పన్నామట..చంద్రబాబు నోట వచ్చే ప్రతి మాట అబద్ధమేనని చెప్పారు. విదేశాల్లో ఉండే తెలుగు వారి మధ్య కూడా చంద్రబాబు కులాలు అంటూ చిచ్చు పెట్టాడని ఆరోపించారు. టీడీపీ చంద్రబాబుది కాదని, ఎన్టీఆర్‌ నుంచి లాక్కున్నాడని విమర్శించారు. చంద్రబాబు అంత అవినీతి పరుడు మరొకరు లేరని, ఇసుక, మట్టి దోచుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపించారు. తాను ఏ పదవులు ఆశించి వైఎస్సార్‌సీపీలో చేరలేదన్నారు.
 

మరిన్ని వార్తలు