కాంగ్రెస్‌లో చేరిన సినీ నిర్మాత బండ్ల గణేశ్‌

14 Sep, 2018 10:59 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బండ్ల గణేశ్‌కు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బండ్ల గణేశ్‌ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఏది చెప్తే అది చేస్తానని, ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలిపారు. మీ ఇష్టదైవం పవన్‌ కల్యాణ్‌ పెట్టిన జనసేన పార్టీలో చేరకుండా కాంగ్రెస్‌ పార్టీలో ఎందుకు చేరారు అని విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్‌ పార్టీ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని సమాధానమిచ్చారు. తనకు పవన్‌ కల్యాణ్‌ తండ్రిలాంటి వారని పేర్కొన్నారు.

శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాలనేదే తన చిరకాల కోరిక అని చెప్పారు. ప్రజాసేవ చేయాలనిపించి రాజకీయాల్లో వచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరినందుకు ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానం ఆశిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా... బేషరతుగా పార్టీలో చేరానని సమాధానమిచ్చారు. రాహుల్‌ గాంధీ వద్ద ఈ విషయం ప్రస్తావించలేదన్నారు. పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని స్పష్టం చేశారు. సినిమా రంగం తనకు ప్రాణమని.. రాజకీయాలు వేరు, సినిమా రంగం వేరని చెప్పుకొచ్చారు. అయితే తానెంతో అభిమానించే పవన్‌ కల్యాణ్‌ పార్టీ జనసేనలో చేరకుండా కాంగ్రెస్‌లోకి ఆయన రావడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు