అసోం బీజేపీలో ముసలం!

16 Dec, 2019 14:20 IST|Sakshi

న్యూఢిల్లీ : హింసాత్మక నిరసనల అనంతరం అసోంలో ఆదివారం నాడు కాస్త ప్రశాంత పరిస్థితులు ఏర్పడ్డాయి. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గత వారం రోజులుగా కొనసాగిన ఆందోళనలో ఐదుగురు మరణించడంతో బీజేపీలో అంతర్గత అసమ్మతి రాజుకుంది. ఈ బిల్లును డిసెంబర్‌ 11వ తేదీన రాజ్యసభ ఆమోదించిన నాటి నుంచి నేటి వరకు పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు తమ ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ వైఖరిని సమర్థించేందుకు బీజేపీ అధికార ప్రతినిధులెవరూ ప్రజల ముందుకు రాలేక పోతున్నారు.

అసోంలోని బీజేపీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు వ్యతిరేకంగా కూడా ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ‘నేనిప్పుడు ప్రజల పక్షానే ఉండదల్చుకున్నాను. ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం తప్పకుండా గౌరవిస్తుందన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు స్పందించకుండా ఓపిక పట్టాను. ఇక లాభం  లేదనుకొని ప్రజల ముందుకు వచ్చాను’ అని బీజేపీ నాయకుడు, అసోం పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ జగదీష్‌ భుయాన్‌ శనివారం నాడు ప్రజాముఖంగా ప్రకటించారు. కేంద్రం తన నిర్ణయాన్ని పునర్‌ పరిశీలించాలని కోరుకుంటున్నానని జోర్హాట్‌ బీజేపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్‌ హితేంద్రనాథ్‌ గోస్వామి వ్యాఖ్యానించారు.

వివాదాస్పర పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించడం పొరపాటని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా తాము రాజకీయంగా, చట్టబద్ధంగా పోరాడతామని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామిగా కొనసాగుతున్న అసోం గణ పరిషద్‌కు చెందిన ఎమ్మెల్యే రామేంద్ర నారాయణ్‌ కలిట ప్రకటించారు. ఈ పరిస్థితిని కేంద్రానికి వినిపించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సోనోవాల్, మరి కొందరు సీనియర్‌ నాయకులు త్వరలో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విదేశీ వలసదారులకు వ్యతిరేకంగా ఆరేళ్లపాటు సాగిన ఆందోళన ఫలితంగా 1985లో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో అస్సామీ జాతీయ వాదులకు మధ్య కుదిరిన ఒప్పందాన్ని గౌరవించాలని అక్కడి ప్రజలు, పార్టీలు డిమాండ్‌ చేస్తున్నారు. అసోం సంస్కృతి, సామాజిక, భాషా పరమైన గుర్తింపును పరిరక్షించడం ఆ ఒప్పందంలో భాగం. 1971. మార్చి 24వ తేదీ తర్వాత అస్సాంలోవి వలసవచ్చిన ప్రతి విదేశీయుడు ఎప్పటికీ విదేశీయుడే. అందుకు విరుద్ధంగా పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ముస్లింలు మినహా మిగతా హిందు, జైన, బుద్ధ, క్రైస్తవ, సిక్కులకు పౌరసత్వం కల్పించేందుకు కేంద్రం వివాదాస్పద బిల్లును తీసుకొచ్చింది.

సంబంధిత వార్తలు..

జామియా విద్యార్థులపై క్రికెటర్‌ ఆందోళన

విద్యార్థులపై హింస: స్పందించిన సుప్రీం

గదుల్లోకి చొరబడి మరీ కొట్టారు..

దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీకి త్వరలో బిల్లు?

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా