బస్తీమే సవాల్‌ అంటున్న సీఎం, గవర్నర్‌ 

18 Jan, 2020 09:30 IST|Sakshi
నారాయణస్వామి,కిరణ్‌బేడి

భూకుంభకోణాలు నిరూపిస్తే తప్పుకుంటా

 లేకుంటే ప్రజాజీవితం నుంచి వెళ్లిపోతారా : సీఎం

పుదుచ్చేరిలో వేడెక్కిన మాటల తూటాలు 

పుదుచ్చేరి ప్రభుత్వంలో రాజ్యాంగాధినేత, ముఖ్యమంత్రి నడుమ వైషమ్యాలు కొత్తేమి కాదు. నారాయణస్వామి సీఎంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కిరణ్‌బేడి నియమితులైన రోజు నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే పరిణామాలు భగ్గుమంటున్నాయి. 

సాక్షి, చెన్నై: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంలో గవర్నర్‌ జోక్యం తగదని సీఎం నారాయణస్వామి, కేంద్రపాలిత ప్రాంతంలో గవర్నరే పాలనాధికారి అంటూ కిరణ్‌బేడి మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. సీఎం అనేకసార్లు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ దశలో ఇరువురూ తాజాగా ఒకరిపై ఒకరు మరోసారి సవాళ్లు విసురుకున్నారు. పుదుచ్చేరి పాగూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తంగవేలు ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. నారాయణస్వామి, ఆయన కుమారుడు భూ అపహరణకు పాల్పడినట్లు, అందుకు ఆధారాలు కూడా ఉన్నట్లు తంగవేలు గవర్నర్‌ కిరణ్‌బేడీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తంగవేలు తనను కలిసి సీఎంపై చేసిన ఫిర్యాదులపై గవర్నర్‌ పత్రికాప్రకటన కూడా విడుదల చేశారు. 

నిరూపిస్తే రాజీనామా: సీఎం నారాయణస్వామి 
‘నేను, నా కుమారుడు భూ అపహరణకు పాల్పడినట్లుగా ఆధారాలతో నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. అయితే ఆరోపణలు నిరూపించకుంటే ప్రజాజీవితం నుంచి తప్పుకునేందుకు కిరణ్‌బేడీ సిద్ధమా’ అని ముఖ్యమంత్రి నారాయణస్వామి సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తంగవేలు గవర్నర్‌ను కలిసినపుడు తాను, తన కుమారుడు భూఅపరణ కేసులు ఎదుర్కొంటున్నట్లుగా ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. అంతేగాక అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె అనడమేగాక రాజ్‌నివాస్‌ ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసిందని సీఎం చెప్పారు. ఈ ఆరోపణలను నారాయణస్వామి ఖండించారు.  ఆధారాలు, పత్రాలు లేకుండానే కేవలం మౌఖికంగా ఆమె ఈ ఆరోపణలు చేశారని విమర్శించారు. ఫిర్యాదుపై విచారణ జరపకుండానే నిర్ధారించుకున్నారని అన్నారు. దీనిని బట్టి ఆమెకు పరిపాలన తెలియదని తేటతెల్లమైందని దుయ్యబట్టారు. తానే కాదు నా కుటుంబసభ్యులెవరైనా భూ అపహరణ కేసులను ఎదుర్కొంటున్నట్లు రుజువుచేస్తే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని పునరుద్ఘాటించారు. నిరూపించలేకుంటే ప్రజాజీవితం నుంచి తప్పుకునేందుకు ఆమె సిద్ధమాని ప్రశ్నించారు. 

నాతో ఢీకొనవద్దు: కిరణ్‌బేడి 
సీఎం నారాయణస్వామి విసిరిన సవాల్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. సీఎం సవాల్‌ విసరాల్సింది నాకు కాదు.. వారి ఎమ్మెల్యేకు. సదరు ఎమ్మెల్యేను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. ఆరోపణలు చేసింది వారి ఎమ్మెల్యేనే. తండ్రీ, కొడుకులు భూ అపహరణకు సంబంధించి ఆధారాలున్నట్లు చెప్పింది కూడా ఎమ్మెల్యే తంగవేలే. ఆధారాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని మీ ఎమ్మెల్యేకు సవాల్‌ విసరుకోండి. లేదా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆధారాలను సమర్పించాలని కోరండి. ఆధారాలుంటే సీబీఐకి అప్పగించాల్సిందిగా హితవు పలికాను కాబట్టి నాపై సవాళ్లు విసరొద్దు. సీబీఐ విచారణకు వస్తే ఆరోపణలను ఎదుర్కోండి. అంతేగానీ దయచేసి నాతో ఢీకొనవద్దు.

మరిన్ని వార్తలు