బోసూ.. ఏదీ నీ ప్లేసు

25 Dec, 2017 12:16 IST|Sakshi

మంత్రి ఇలాకాలో ముదిరిన వర్గపోరు

పలమనేరు టీడీపీలో తారస్థాయికి విభేదాలు

అంతర్మథనంలో బోస్‌ వర్గం

మంత్రి నిర్వహించిన సభకు డుమ్మా

జిల్లా టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ముఖ్యంగా మంత్రి  అమరనాథరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పలమనేరు నియోజకవర్గంలో ఇవి బహిర్గతమయ్యే స్థాయికి చేరాయి. మొదటి నుంచి అష్టకష్టాలకోర్చి టీడీపీకి జవసత్వాలు నింపినా.. పార్టీలు మారిన వారికే ప్రాధాన్యం దక్కుతుండడంపై బోస్‌ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తాజాగా మంత్రి నిర్వహించిన బహిరంగ సభకు బోస్‌ డుమ్మా కొట్టడంతో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బట్టబయలైంది.

పలమనేరు: కష్టకాలంలో క్యాడర్‌ను కాపాడుకుని పార్టీని బలోపేతం చేసిన పలమనేరు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి సుభాష్‌చంద్ర బోస్‌ మంత్రి అమనాథరెడ్డి తీరుపై అంతర్మథంలో పడ్డారా..? అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పలమనేరులో శుక్రవారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి, ఆపై జరిగిన ర్యాలీ, బహిరంగ సభకు స్థానిక నేత బోస్‌ హాజరు కాకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయం ముగ్గురు మంత్రులు హాజరైన జిల్లా సమన్వయ కమిటీలోనూ చర్చించినట్లు సమాచారం. టీడీపీ రాష్ట్ర కోశాధికారిగా, రాష్ట్ర కార్యవర్గంలో చోటున్న వ్యక్తికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం బోస్‌ను కుంగదీసినట్టు సమాచారం. దీంతో ఆయన అనుచరులు మంత్రి తీరుపై లోలోన అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. మొత్తం     మీద అధికార పార్టీలో బోస్‌ పరిస్థితి పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా ఉందంటూ ఆ పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. ఈ వ్యవహారం ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో తెలియడం లేదని     అంటున్నారు.

అమర్‌ రాక.. బోస్‌కు కాక
గత శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న అమర్‌నాథ్‌ రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. అప్పటినుంచే బోస్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో అమర్‌నాథరెడ్డిపై తృటిలో ఓటమిపాలైన బోస్‌ వచ్చే ఎన్నికల్లోనైనా గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో అమర్‌ పార్టీ ఫిరాయించడంతో బోస్‌ డైలామోలో పడ్డారు. అయితే చంద్రబాబు తనకు అన్యాయం చేయరనుక్ను బోస్‌ సీఎం మాట ప్రకారం మంత్రితో ఇన్నాళ్లూ కలసిమెలసి ఉండేవారు. అయితే బోస్‌కు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిపోవడం మొదటి దెబ్బ. అనంతరం బోస్‌ కార్యాలయంపై ఐటీ దాడులు జరిగాయి. దీంతో నమ్ముకున్న పార్టీ ఇలా చేసేందేమిటనే ప్రశ్న ఆయన్ను వేధించింది. ఫలితంగా పార్టీకి కాస్త దూరంగానే గడిపారు.

దీంతో పార్టీని సైతం వీడతారనే ఊహాగానాలు అప్పట్లో మొదలయ్యాయి. ఈ విషయం కాస్తా అధిష్టానానికి తెలసి ఆయన్ని ప్రసన్నం చేసేందుకు రాష్ట్ర కార్యవర్గంలో కీలకమైన కోశాధికారి పదవిని కట్టబెట్టారు. అప్పటికే రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రి పదవిని పొందిన అమర్‌ మెల్లమెల్లగా తనప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ప్రభుత్వ పథకాలను మంత్రి మనుషులకు ఇవ్వడం, బోస్‌ వర్గాన్ని పక్కన పెట్టడం మళ్లీ వర్గపోరుకు ఆజ్యం పోసింది. పట్టణంలో రెండు పార్టీ కార్యాలయాలు, కొన్ని కార్యక్రమాలకు బోస్‌ వెళ్లకపోవడం తదితర పరిణామాలు తీవ్రస్థాయికి చేరాయి. దీంతో బోస్‌ గత మూడునెలలుగా పార్టీలో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు.

అసలు రహస్యం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టేనా?
అంసతృప్తితో ఉన్న బోస్‌కు అధిష్టానం రాష్ట్ర కోశాధికారి పదవితో పాటు వచ్చే ఎన్నికల్లో పలమనేరు టిక్కెట్టు కూడా ఇస్తామని చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. అయితే రెండోసారి పార్టీలో చేరినప్పటి నుంచి అభివృద్ధి చేసి ఇక్కడే బరిలో ఉంటానని తరచూ సభలు, సమావేశాల్లో బోస్‌ సమక్షంలోనే అమర్‌నాథరెడ్డి ప్రస్తావించేవారు. ఆ మాటలు బోస్‌కు తెగ ఇబ్బందికరంగా మారాయి. గత కొన్నాళ్లుగా పుంగనూరుకు మంత్రి, పలమనేరుకు బోస్‌ అభ్యర్థులనే మాటలు స్థానికంగా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ తరుణంలో ఎలాగైనా తన ఆధిపత్యాన్ని చూపెట్టాలనే మంత్రి మొన్న జరిగిన బహిరంగసభను, ర్యాలీని ఏర్పాటు చేసినట్టు బోస్‌ అనుచరుల వాదన. ఈ విషయం ముందుగానే గ్రహించిన బోస్‌ అందుకే మంత్రి సభకు డుమ్మాకొట్టారనే మాటలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి 93 వేల ఓట్లను సాధించిన బోస్‌కు పార్టీలో గుర్తింపు తగ్గడాన్ని ఆయన, అతని వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం మీద ఇక్కడ జరుగుతున్న పరిణామాలతో బోస్‌ త్వరలోనే  కీలకనిర్ణయం తీసుకోబోతున్నారని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు. ఈ టాపిక్‌ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు