త్రిపురలో బీజేపీ సంచలనం!

3 Mar, 2018 09:37 IST|Sakshi

కమ్యూనిస్టుల కంచుకోట బద్దలు

సంపూర్ణ మెజారిటీ దిశగా బీజేపీ

సాక్షి, న్యూఢిల్లీ : కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన త్రిపురను కైవసం చేసుకునే దిశగా బీజేపీ సాగుతోంది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో 25 ఏళ్ల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ.. బీజేపీ కూటమి సంచలన విజయం దిశగా సాగుతోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి 40కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో నిలిచి.. సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేస్థితిలో పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ నేతృత్వంలోని వామపక్ష కూటమి కౌంటింగ్‌ ప్రారంభంలో గట్టిపోటీనిచ్చినట్టు కనిపించడంతో త్రిపురలో హోరాహోరీ తప్పదని భావించారు. మొదట్లో బీజేపీ కొంత వెనుకబడినట్టు కనిపించినా.. తాజాగా అందుతున్న ట్రెండ్స్‌ ప్రకారం.. బీజేపీ కూటమి 42 స్థానాల్లో, వామపక్ష కూటమి 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో త్రిపురలో బీజేపీ పాగా వేయడం ఖాయమని తేలిపోయింది.

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. త్రిపురలో మొత్తం 59 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే కావాల్సిన సంఖ్యబలం 31. ప్రస్తుత ట్రెండ్స్‌ను బట్టి చూస్తే బీజేపీ కూటమి సునాయాసంగా అధికారం చేపట్టనుందని తెలుస్తోంది. త్రిపురలో 25 ఏళ్లుగా కొనసాగుతున్న వామపక్ష కూటమికి పరాభవం తప్పదని, ఇక్కడ బీజేపీ అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉందని రెండు ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నిజాయితీపరుడిగా పేరొందిన ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కారు నేతృత్వంలోని సీపీఎం కూటమికి ఈసారి గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చునని ఎన్నికల సర్వేలు అంచనా వేశాయి. ఎన్నికల ఫలితాలు సర్వేల అంచనాలు నిజమేనని అంటున్నాయి. ఈ ఫలితాలతో బీజేపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు