రాహుల్‌ నిర్ణయమే ఫైనల్‌

18 Jan, 2019 01:23 IST|Sakshi

సీఎల్పీ నేత నియామక బాధ్యతను ఏఐసీసీ చీఫ్‌కు కట్టబెడుతూ తీర్మానం..

కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులతో అధిష్టానం దూత వేణుగోపాల్‌ సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతను ఎన్నుకునే అధికారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి దఖలు పడింది. సీఎల్పీ నేతను నియమించే అధికారాన్ని రాహుల్‌కు కట్టబెడుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ కార్యాలయంలో 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. అధిష్టానం నుంచి కేరళ రాష్ట్రానికి చెందిన లోక్‌సభ సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వేణుగోపాల్, కుంతియాలు 19 మంది సభ్యుల నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలను సేకరించారు. ఎమ్మెల్సీలతో కూడా మాట్లాడారు.  

ఒక్కొక్కరితో 5 నిమిషాల పాటు మంతనాలు 
సీఎల్పీ నేత రేసులో ఉన్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలకు మద్దతుగా కొందరు తమ అభిప్రాయాన్ని తెలిపారు. మరికొందరు పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని, కొత్తవారికి అవకాశమివ్వాలని కోరినట్టు తెలిసింది. సీఎల్పీ పదవిని ఆశిస్తున్న సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా తనకు సీఎల్పీ నేతగా పనిచేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఒక్కో ఎమ్మెల్యేతో 5 నిమిషాలు మాట్లాడిన అధిష్టానం దూతలు వారు చెప్పిన అభిప్రాయాలను వినడంతో పాటు సీఎల్పీ నేతగా అధిష్టానం ఎవరిని నియమించినా కట్టుబడి ఉండాలని సూచించారు.  

అసెంబ్లీ హాలులో మరో భేటీ 
దాదాపు గంటన్నర పాటు సీఎల్పీ కార్యాలయంలో సమావేశమైన అనంతరం అధిష్టానం దూతలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ కమిటీ హాలులో మళ్లీ సమావేశమయ్యారు. సీఎల్పీ నేతను నియమించే అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహు ల్‌ గాంధీకి కట్టబెడుతూ తీర్మానాన్ని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి సభ్యులం తా ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. దీని తర్వాత కాం గ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి వేణుగోపాల్‌ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. సీఎల్పీ నేతను నియమించే బాధ్యతను రాహుల్‌కు కట్టబెడుతూ తీర్మానించినట్లు వెల్లడించారు. సీఎల్పీ నేతగా ఎవరుండాలనే అంశంపై తాను పార్టీ సీనియర్‌ నేతలు, కోర్‌కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నుంచి అభిప్రాయాలను తీసుకున్నామని, సభ్యుల అభిప్రాయాలన్నింటినీ రాహుల్‌కు వివరిస్తామని తెలిపారు. అతి త్వరలోనే సీఎల్పీ నేత ఎవరనేది రాహుల్‌ ప్రకటిస్తారని చెప్పారు. అనంతరం కేసీ వేణుగోపాల్‌ బెంగళూరుకు వెళ్లిపోయారు.  

నేడు ప్రకటించే చాన్స్‌.. 
సీఎల్పీ నేత ఎవరన్నది శుక్రవారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారమే ప్రకటించాల్సి ఉన్నా రాహుల్‌ ఢిల్లీలో అందుబాటులో లేని కారణంగా ఆలస్యమైనట్టు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎల్పీ నేతగా పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్కను నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయ, సామాజిక సమీకరణల నేపథ్యంలో అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇటు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్, శ్రీధర్‌బాబుల పేర్లను కూడా అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోంది.   

మరిన్ని వార్తలు