‘ప్రజాస్వామ్య స్ఫూర్తి కేసీఆర్ చేతిలో నలిగి పోతుంది’

19 Nov, 2019 16:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వ్యవస్థలను, ఉద్యోగులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్‌లా దేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి ప్రవర్తించడం లేదని ఆయన విమర్శించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జీలతో కమిటీ వేయాలని కోరగా.. కమిటీ వేసినా ప్రభుత్వం ఇసుక రేణువంత కూడా పట్టించుకోదని హైకోర్టు వాఖ్యానించిందని ప్రస్తావించారు. జ్యూడీషియల్ వ్యవస్థ చెప్పినా ఈ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి కేసీఆర్ చేతిలో నలిగి పోతుందని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని, లేకపోతే రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ చర్చలకు పిలవకపోతే రాజ్యాంగ సంక్షోభం గురించి గవర్నర్‌కు రాష్ట్రపతికి  విన్నపిస్తామని పేర్కొన్నారు. 

వెంటనే జీతాలు చెల్లించాలి
ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతిపక్షాలు కుట్ర చేశాయని హైకోర్టుకు ఆఫిడవిట్ దాఖలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వీటికి ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సెల్ఫ్ డిస్మిస్ అని కేసీఆర్ చెప్పడం వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు, గుండె పోటుతో చనిపోయారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ ప్రతిపక్షాలపైన నెపం నెట్టుతున్నాడని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులకు రెండు నెలల నుంచి ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జీతాలు రాకపోవడంతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, వెంటనే ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు