‘టీఆర్‌ఎస్‌లో ఓనర్షిప్‌ల కొట్లాట మొదలైంది’

1 Sep, 2019 14:48 IST|Sakshi

సాక్షి, భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో ఓనర్షిప్‌ కోసం నాయకులు గొడవలు పెట్టుకుంటూ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిని విక్రమార్క, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువు నాయకులు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రోగులను, ప్రజలను మర్చిపోయి ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. 

జిల్లా కేంద్ర ఆసుపత్రులు అంటే 250 పడకలతో ఉంటుందని, కానీ ఇక్కడ కేవలం 6 పడకలు మాత్రమే ఉన్నాయని విమర్శించారు. భూపాలపల్లి జిల్లాగా ఏర్పడి మూడేళ్లవుతున్నా ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడం, జిల్లా ఆసుపత్రిగా మార్చకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ఆస్పత్రికి రోగుల రావాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయని, ప్రస్తుతం ఇన్ పేషంట్లు ఎవరూ లేరని భట్టి పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఏంఆర్ఐ, సీటీ స్కాన్, ఎక్స్ రే ప్లాంట్, ఈసీజీ లేవని, ఇంతటి దుర్భర పరిస్థితులు ఎక్కడా ఉండవని మండిపడ్డారు. ప్రసూతి కోసం వచ్చే మహిళలకు ఉండాల్సిన గైనకాలజిస్టులు ఒక్కరు కూడా లేరని, ఆపరేషన్ థియేటర్ అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉందని విక్రమార్క విమర్శించారు. 

ఆపరేషన్ థియేటర్‌ను స్టోర్ రూమ్‌గా మార్చిన పరిస్థితి కన్పిస్తుందని, కనీసం ఆస్పత్రిలో లాబ్ టెక్నీషియన్ కూడా లేరని దుయ్యబట్టారు. జిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా కుక్క, కోతి కాట్లకు గురవుతున్నారని, అందుకు కావాల్సిన సిరంజీలు కూడా లేవని విమర్శించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులు బయట సిరంజీలు కొనుక్కుంటే ఇక్కడ ఇంజక్షన్‌లు ఇస్తున్నారని, ఇది దుర్భరమైన పరిస్థితి బట్టి అంటూ భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు