ఎవరా ఇద్దరు?

23 Apr, 2019 05:10 IST|Sakshi

శాసనసభాపక్ష విలీనంపై కాంగ్రెస్‌లో ఆందోళన!

ఇప్పటికే 11మంది జంప్‌.. మరో ఇద్దరు సంతకాలు పెట్టారని చర్చ

ఉండేదెవరు, వీడేదెవరనే దానిపై ఆరా తీస్తున్న అధిష్టానం

ఓవైపు ధీమా.. మరోవైపు టీపీసీసీ బుజ్జగింపులు

సాక్షి, హైదరాబాద్‌: కొంత విరామం తర్వాత మళ్లీ వలసల వ్యవహారం తెరపైకి రావడం రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పార్టీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలను దాదాపుగా తమ పక్షాన చేర్చుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరో ఇద్దరికీ ఆహ్వానం పలికి కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని (సీఎల్పీ) విలీనం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసిందన్న వార్తలు ప్రతిపక్ష కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం పార్టీలో మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో చేజారిపోతున్న ఆ ఇద్దరు ఎవరనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాస్త మరుగునపడిన వలసల వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో.. రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలు కూడా అప్రమత్తం అవుతున్నారు.

తమపార్టీ నుంచి ఎమ్మెల్యేలెవరూ వెళ్లడం లేదని ధీమా వ్యక్తం చేస్తూనే.. ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు. గండ్ర కూడా కారెక్కిన తర్వాత మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల్లో పార్టీని వీడి వెళ్లొచ్చనే భావిస్తున్నవారు ఏం చేస్తున్నారనే దానిపైనా దృష్టి సారించారు. వారి ఆలోచనలను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ పార్టీని వీడి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం కూడా ఈ అంశంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. సీఎల్పీ కూడా విలీనం చేసుకునే దిశలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయన్న విషయం తెలుసుకున్న ఢిల్లీ పెద్దలు కూడా పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరుంటారు? ఎవరు వెళ్లిపోతారనే దానిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే సంతకాలు పెట్టేశారా?
గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటే మొత్తం సంఖ్యలో 2/3 వంతుకు ఒకరు అదనంగా అంటే.. 13 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అధికారికంగానే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. తాజాగా సోమవారం గండ్ర కూడా కారెక్కుతున్నట్లు స్పష్టం చేశారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు వీరికి తోడయితేనే అది సాధ్యమవుతుంది. ఆ ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారని, ఈనెల 24న లేదంటే అసెంబ్లీ సమావేశాలు మళ్లీ మొదలయ్యేలోపు సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తవుతుందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ 11 మంది ఎమ్మెల్యేలతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు విలీనం నోటీసులపై సంతకాలు కూడా చేసేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఆ ఇద్దరు ఎవరన్న దానిపై గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ గిరిజన ఎమ్మెల్యేతోపాటుగా ఆసక్తికర వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎమ్మెల్యే ఒకరు ఈ జాబితాలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నా.. ఆయన మానసికంగా సిద్ధం కాలేదని కొందరంటున్నారు.

స్వరం పెంచిన సీఎల్పీ నేత
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్వరం పెంచారు. సీఎల్పీని విలీనం చేసే దిశలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పావులు కదుపుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. సోమవారం గాంధీభవన్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ సీఎల్పీని విలీనం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదంటూనే.. ‘విలీనం చేసి చూడు. నీ ప్రభుత్వం ఉంటుందో? నువ్వుంటావో? మేమూ చూస్తాం. రాజ్యాంగ సంక్షో భం సృష్టించైనా నీ ప్రభుత్వం లేకుండా చేస్తాం’అని సీఎం కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లుగా అన్నీ భరించి మౌనంగా ఉన్నామని, ఇప్పుడు ఊరూరా తిరిగి నిలదీస్తామని భట్టి హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరగబడతారని, భవిష్యత్తులో కేసీఆర్‌ను కుక్కలు కూడా కానవన్నారు. ఎంత మంది ఎమ్మెల్యేలు మిగిలినా వారితో కలిసి యుద్ధం చేస్తామే తప్ప నీ ముందు మోకరిల్లే ప్రసక్తే లేదని ఆయన కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం.   

ఐదుగురే మిగులుతారా?
ఇప్పటికిప్పుడే కాకపోయినా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతే వలసలు ఉండొచ్చని జోరుగా చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఫలితాలు తారుమారైతే.. ప్రస్తుతం మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల్లో మరో నలుగురు చేజారడం ఖాయమని, కేవలం ఐదుగురు మాత్రమే మిగులుతారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. దీనికి అనుగుణంగానే ఓ ఎమ్మెల్యే మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ నిర్ణయం తీసుకునేందుకు ఓ బలహీన క్షణం సరిపోతుందని, అయితే ఆ క్షణం కోసం మే 23వ తేదీ తర్వాతే ఆలోచిస్తానని వ్యాఖ్యా నించడం గమనార్హం. మొత్తంమీద ప్రస్తుత పరిస్థితుల్లో సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తారా? ఎప్పుడు చేస్తారు? మళ్లీ వలసలుంటాయా? ఉంటే ఇప్పుడే ఉంటాయా? లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతేనా? పార్టీని వీడి వెళ్లిపోయేది ఎవరు? ఉండేదెవరు? అనే దానిపై రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుండటం గమనార్హం.  
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా