చంద్రబాబు – లింగమనేని.. ఈ భూ బంధం దృఢమైనది

26 Jun, 2018 02:33 IST|Sakshi

     15 ఏళ్ల క్రితమే లింగమనేనికి చంద్రబాబు భూ సంతర్పణ

     2003లో వ్యూహాత్మకంగా 115.91 ఎకరాల అప్పగింత

     వీజీటీఎం– ఉడా ద్వారా కథ నడిపించిన చంద్రబాబు

     ప్రజావసరాలకోసం తీసుకుని లింగమనేనికి ధారాదత్తం

     అది చట్టవిరుద్ధమని నిపుణులు చెప్పినా పట్టించుకోని వైనం

     బాబుకు గెస్ట్‌హౌస్, హెరిటేజ్‌కు భూమి సమర్పించిన లింగమనేని

     లింగమనేని భూములే రాజధానికి సరిహద్దుగా నిర్ణయం

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: భూములు దోచుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు–లింగమనేని గ్రూపు (రమేశ్‌)ల బంధం ఏళ్ల క్రితం నుంచి దృఢంగా కొనసాగుతోంది. అసలు లింగమనేని వ్యాపారంలోనే చంద్రబాబుకు వాటాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా.. లింగమనేనికి వంద ఎకరాలకు పైగా సంతర్పణ చేశారు. దీని కోసం నిబంధనలకు నీళ్లొదిలారు. ప్రజాప్రయోజనాలను గాలికొదిలారు. విజయవాడ–గుంటూరు మధ్యలో 16వ నంబర్‌ జాతీయ రహదారి వెంబడి ప్రజావసరాల పేరుతో సేకరించిన భూములను 2003లో లింగమనేని గ్రూపునకు చంద్రబాబు కట్టబెట్టడం చూస్తే వాళ్ల బంధం ఎంతలా పెనవేసుకుందో ఇట్టే అర్థం అవుతుంది. చంద్రబాబు సహకారానికి ప్రతిగా ఆయనకు కృష్ణా నదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన గెస్ట్‌ హౌస్‌ను, హెరిటేజ్‌ సంస్థకు 14.22 ఎకరాల భూములను లింగమనేని సమర్పించుకున్నారు. 

ప్రజావసరాల పేరుచెప్పి..
రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా 2001లో ప్రజావసరాల పేరుతో (సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం) వీజీటీఎం–ఉడా ద్వారా ‘సైట్స్‌ అండ్‌ సర్వీసెస్‌’ పథకం పేరిట 115.91 ఎకరాలను తీసుకోవాలని నిర్ణయించారు. దీని కోసం మంగళగిరి ప్రాంతంలోని నంబూరు, కాజ, కంతేరు గ్రామాల మధ్య జాతీయ రహదారి పక్కన, నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఏసీసీ సిమెంట్స్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఉన్న భూములే లక్ష్యంగా వ్యూహం అమలు చేశారు. భూ సేకరణ క్రమాన్ని ఇలా కొనసాగించారు.

1. భూసేకరణ నోటిఫికేషన్‌ నం.ఆర్‌.సి.5549/2001– జి1 (తేదీ 25–12–2001) ద్వారా  గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో సర్వే నంబరు 142/1బి, 144/1బిలో  7.63 ఎకరాల కోసం నోటిఫికేషన్‌ జారీచేసింది.
2. భూ సేకరణ నోటిఫికేషన్‌ నం.ఆర్‌.సి.5550/2001–జి1 (తేదీ 25–12–2001) ద్వారా గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో సర్వే నెంబరు 203, 204/ఏ, 204/బి2, 206/1, 206/2, 213/ఏ (పి), 207, 213/బి (పి), 214(పి), 215, 216/2, 217లో 69.81 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్‌ జారీచేసింది. 
3. భూసేకరణ నోటిఫికేషన్‌ నం.ఆర్‌.సి.5551/2001– జి1 (తేదీ 25–12–2001) ద్వారా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని సర్వే నంబరు 142, 143/1బి, 144,145, 146/1బిలో 38.47 ఎకరాలు కోసం నోటిఫికేషన్‌ ఇచ్చింది.
ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా 115.91 ఎకరాలను వీజీటీఎం – ఉడా 11 నెలల వ్యవధిలో సేకరించింది.

పేరు ఒకరికి.. ఫలితం మరొకరికి
సేకరించిన 115.91 ఎకరాలను స్వల్పకాలంలోనే లింగమనేని రియల్‌ ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి వీజీటీఎం–ఉడా కట్టబెట్టేసింది. ముందస్తు ప్రణాళికలో భాగంగా ఆ భూముల వేలం ప్రకటన (ఆర్‌.సి.నెం:365/2001, తేదీ 13–03–2003) జారీచేసింది. 27–03–2003న బిడ్లు పిలిచింది. వేలం ఆపాలని హైకోర్టు స్టే ఆర్డర్లు ఇచ్చినప్పటికీ ఏమాత్రం జాప్యం లేకుండా లింగమనేని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి 115.91 ఎకరాలను రూ. 8 కోట్లకు ప్రభుత్వం అప్పగించేసింది. అదే భూమిలో మౌలిక వసతులు కల్పించి, అభివృద్ధి చేసి  విక్రయించి ఉంటే అప్పట్లోనే కనీసం రూ. 100 కోట్ల వరకు ఉడాకు సమకూరేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇదంతా అప్పటి ప్రభుత్వాధినేత చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందనేది బహిరంగరహస్యమే. భూసేకరణ ద్వారా తీసుకున్న భూమిని సేకరించిన అవసరాల కోసం కాకుండా, ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఉడా యథాతథంగా విక్రయించడమనేది చట్టవిరుద్ధమని  నిపుణులు చెప్పినా అప్పట్లో సర్కార్‌ పట్టించుకోలేదు. 

ఐజేఎం–రెయిన్‌ ట్రీపార్కు.. 
సీఎం చంద్రబాబుకు సింగపూర్, మలేసియాలతో వ్యాపారపరమైన సంబంధాలు గతం నుంచి ఉండేవనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ నేతలకు ఎరుకే. ఆ సంబంధాల నేపథ్యంలోనే మలేసియాకు చెందిన ఐజేఎం సంస్థకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు స్థలం కేటాయించి ఐజేఎం– మలేషియా టౌన్‌షిప్‌ను నిర్మించారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఆ క్రమంలోనే వీజీటీఎం– ఉడా నుంచి లింగమనేనికి ధారాదత్తం చేసిన 115.91 ఎకరాల్లోనే ఐజేఎం–రెయిన్‌ ట్రీపార్కు అపార్టుమెంట్ల సముదాయం రూపుదిద్దుకుంది. అపార్ట్‌మెంట్లను విక్రయించడం ద్వారా సొమ్ము చేసుకోవడంతో పాటు తాజాగా తమ వారికి చెందిన ప్లాట్లను ఎక్కువ అద్దె చెల్లిస్తూ అధికారులకు నివాసాలుగా చంద్రబాబు సర్కార్‌ కేటాయించింది. 

‘లింగమనేనే’ రాజధాని సరిహద్దు..
రాష్ట్ర విభజన తరువాత నూతన రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలో లింగమనేని భూములు ల్యాండ్‌ పూలింగ్‌ పరిధిలోకి రాకుండా భారీ ఎత్తున లబ్ధి చేకూర్చారు. రాజధానికి లింగమనేని రియల్‌ ఎస్టేట్‌ భూములే సరిహద్దు. ఆ భూములకు కేవలం కొద్ది మీటర్ల దూరంలోనే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వెళుతోంది. తన పరోక్ష భాగస్వామి, బినామీ అయిన లింగమనేనికి ఆర్థిక సహకారం అందించడం, తద్వారా తాను లబ్ధి పొందడంలో భాగంగా పెద్ద సంస్థల చేత భూములను కొనుగోలు చేయిస్తున్నారు. ఏసీసీ సిమెంట్స్‌ భూములతో పాటు సన్న, చిన్నకారు రైతుల నుంచి వందలాది ఎకరాలను నామమాత్రపు ధరకు తీసుకున్న లింగమనేని నుంచి ఒక ప్రముఖ విద్యాసంస్థ, మిల్క్‌డెయిరీ అధినేత, వైద్యవిద్యను అందిస్తున్న మరో సంస్థతో పదుల ఎకరాలను చంద్రబాబు కొనుగోలు చేయించారని సమాచారం. ముఖ్యమంత్రి ఆశీస్సులతో భారీ కాంట్రాక్టులను దక్కించుకుంటున్న ప్రముఖ సంస్థ కొన్నాళ్ల కిందట లింగమనేని నుంచి 150 ఎకరాల వరకు కొనుగోలు చేసిందని తెలిసింది. ఈ ని«ధులన్నీ చంద్రబాబు జేబులోకే వెళ్లినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. 

ఎయిర్‌ కోస్టాకు సహకారం..
లింగమనేని నేతృత్వంలోని ఎయిర్‌కోస్టా విమానయాన సంస్థకు వెన్నుదన్నుగా ఉన్నది సీఎం చంద్రబాబే అని పారిశ్రామిక వర్గాలకు తెలిసిన విషయమే. ఓ ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ద్వారా రూ. వందల కోట్లను అందులో పెట్టుబడిగా పెట్టించింది కూడా చంద్రబాబేనని చెపుతుంటారు. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్‌కోస్టాకు అశోక్‌గజపతిరాజు విమానయానశాఖ మంత్రిగా ఉండగా జాతీయస్థాయి పర్మిట్‌ ముఖ్యమంత్రి ఇప్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చంద్రబాబును పట్టుకుంటే ఎంతటి పనైనా అయిపోతుందని ఎయిర్‌ ఏషియా సంస్థ సీఈవోల మధ్య జరిగిన ఆడియో సంభాషణల్లో వెల్లడైన విషయం తెలిసిందే. దీన్నిబట్టి ఎయిర్‌కోస్టాకు పర్మిట్‌ దక్కడంలో ఆశ్చర్యమేముందని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా, ఎయిర్‌కోస్టాకు సంబంధించి మరో కోణంలోనూ చంద్రబాబు, లింగమనేని ఆర్థిక ప్రయోజనం పొందారనే ఆరోపణలు ఉన్నాయి. లాభాలు  ప్రకటించిన కొద్దికాలానికే నష్టాలంటూ ఎయిర్‌కోస్టాను మూసేసి ఆర్థిక ప్రయోజనాలు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకోవడానికి ఎయిర్‌కోస్టాను సాధనంగా వాడుకున్నట్లు అంతర్జాతీయ, జాతీయ పత్రికల్లో వార్తాకథనాలు కూడా ప్రచురితమయ్యాయి. 

పోలీస్‌ బెటాలియన్‌ తరలింపులో లోగుట్టు ఇదేనా?
మంగళగిరి వద్ద వందలాది ఎకరాల్లో ఉన్న పోలీస్‌ బెటాలియన్‌ను అక్కడి నుంచి గుంటూరు జిల్లా అచ్చంపేట మండలానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ మేరకు ప్రతిపాదనలు ఇదివరకే చేశారు. ఇందుకు కారణం లింగమనేనికి సహకారం అందించడానికే అనేది స్పష్టమవుతోంది. బెటాలియన్‌ సమీపంలోనే లింగమనేని సంస్థ భారీస్థాయిలో బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లను నిర్మిస్తోంది. అదే ప్రాంతంలో ఇంకా స్థలాలు ఉన్నాయి. లింగమనేని ఆస్తులకు విలువను పెంచడానికేనని పోలీస్‌ బెటాలియన్‌ను తరలిస్తున్నారని ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పోలీసు కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు