రాజధానిపై ప్రజల్లో సందేహాలున్నాయ్‌: సీఎం

19 Apr, 2018 02:13 IST|Sakshi
సీఎంతో భేటీ అయిన ఐబీ డైరెక్టర్‌ జైన్‌

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రంతో విభేదాల వల్ల పనులు నిలిచిపోతాయనే ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని చెప్పాలని అధికారులకు సూచించారు. రాజధాని పనులను డ్రోన్ల ద్వారా వీడియో తీసి, రెండు నిమిషాల లఘుచిత్రాలు రూపొందించి ప్రతి నెలా సినిమా థియేటర్లలో, మీడియా చానళ్లలో ప్రదర్శించాలని ఆదేశించారు. రాజధాని వ్యవహారాలపై బుధవారం సచివాలయంలో సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాజధానికి అవసరమయ్యే నిధులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై 18 ఏళ్లకు రూపొందించిన ఆర్థిక ప్రణాళికను ఈ సమావేశంలో ఆమోదించారు. కాగా, మొత్తం రాజధాని ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.48,115 కోట్లు అవసరమని అంచనా వేసినట్లు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. 

సీఎంను కలిసిన ఐబీ డైరెక్టర్‌ రాజీవ్‌ జైన్‌: ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) డైరెక్టర్‌ రాజీవ్‌ జైన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలయిక రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. షెడ్యూల్‌లో లేకుండా జైన్‌ బుధవారం నేరుగా సచివాలయానికి రావడం ఉత్కంఠ రేపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇటీవల కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇరువురు సుమారు గంటన్నర సేపు భేటీ కావడం గమనార్హం. సమావేశం వివరాలను సీఎంవో గోప్యంగా ఉంచడంపైనా సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని కేంద్రానికి వివిధ వర్గాల ద్వారా ఫిర్యాదులు అందడం, కేంద్రం నుంచి అందిన నిధుల వినియోగంలోనూ పెద్ద ఎత్తున లోపాలు చోటుచేసుకున్నాయనే విమర్శలు ఉన్న నేపధ్యంలో ఐబీ భేటీ జరగడం విశేషం. ప్రధాని మోడీ దీక్షను ఎద్దేవా చేసి ఈ నెల 20న సీఎం చంద్రబాబు ఒక రోజు నిరాహార దీక్ష చేస్తుండటంతో ఐబీ డైరెక్టర్‌ పర్యటన టీడీపీ శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ భేటీలో పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలకపాత్ర పోషించడం పరిశీలనాంశం. సీఎంతో భేటీ తర్వాత మంగళగిరిలో డీజీపీ కార్యాలయాన్ని సందర్శించారు. అకస్మాత్తుగా ఐబీ డైరెక్టర్‌ రాష్ట్రంలో పర్యటించడంపై టీడీపీ వర్గాలు ఒకింత ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.   

మరిన్ని వార్తలు