‘ఫిరాయింపు’ లెక్కలున్నాయ్‌!

6 Jul, 2018 02:59 IST|Sakshi

పార్టీ మారిన ఎమ్మెల్యేతో సీఎం చంద్రబాబు వ్యాఖ్య

మీకు ఇచ్చిందెంతో పూర్తి వివరాలున్నాయి

మొత్తం చిట్టా తన వద్ద ఉందన్న సీఎం

ఫిరాయింపుదారులు ఎదురుదాడికి దిగితే బెదిరించే వ్యూహం

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘పార్టీ మారే సమయంలో మీకు ఏమిచ్చామో, ఆ తర్వాత ఏ కాంట్రాక్టు పనుల ద్వారా ఎంత ఆదాయం వచ్చేలా చేశామో అన్ని లెక్కలూ నావద్ద ఉన్నాయి. ఎంతో నష్టపోయామంటూ నావద్ద మాటలు చెప్పొద్దు. మీకు చేసిన ప్రతి పని వివరాల చిట్టా నావద్ద ఉంది’’ అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఏం చేశామనే వివరాలన్నీ తన వద్ద ఉన్నాయంటూ చంద్రబాబు చెప్పడం వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పార్టీ మారిన సమయంలో ఎంత ఇచ్చాం? కాంట్రాక్టు పనులు, నీరు–చెట్టు పనులు ఏవి ఇచ్చామనే వివరాలతోపాటు సదరు ఎమ్మెల్యే సిఫారసుతో చేసిన అధికారుల బదిలీలు, ఎమ్మెల్యే కమీషన్ల వివరాలతో చంద్రబాబు సమాచారాన్ని సిద్ధం చేసుకోవడం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

పార్టీ మారి నష్టపోయామన్న ఫిరాయింపు ఎమ్మెల్యే
కర్నూలు జిల్లాకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఒకరు తన అనుచరుడికి కనీసం చివరి ఏడాదైనా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పోస్టు ఇప్పించాలంటూ తాజాగా చంద్రబాబు వద్దకు వెళ్లినప్పుడు ఆయన సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అది కుదరదని చంద్రబాబు చెప్పడంతో అసంతృప్తికి గురైన ఫిరాయింపు ఎమ్మెల్యే పార్టీ మారి తాను, తన కేడర్‌ ఎంతో నష్టపోయామని వ్యాఖ్యానించారు.

దీంతో సదరు ఎమ్మెల్యే పనుల చిట్టాను చంద్రబాబు విప్పినట్టు సమాచారం. పార్టీ మారే సమయంలో ఏ పనులు చేయించుకున్నారు, ఎంత సంపాదించారనే మొత్తం వివరాలు ఉన్నాయంటూ సీఎం ఆగ్రహంగానే స్పందించినట్లు తెలిసింది. దీంతో సదరు ఎమ్మెల్యేతో పాటు ఆయన వెంట వెళ్లిన అనుచరులకు కూడా షాక్‌ తగిలింది. చంద్రబాబు వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో సీటు విషయం కూడా గట్టిగా అడగలేని పరిస్థితికి చేరుకున్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేలు మథనపడుతున్నట్లు సమాచారం.

పార్టీ మారిన తర్వాత తమ ఆదాయ వివరాలను బేరీజు వేసి సమాచారం సిద్ధం చేసిన విషయం తెలియడంతో కలవరపాటుకు గురవుతున్నారు. 22 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు భారీ మొత్తం చెల్లించి టీడీపీ కొనుగోలు చేసిందన్న ఆరోపణలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.

పలువురికి సీట్లు ఇవ్వనట్లే!
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు వ్యవహారశైలి  చర్చనీయాంశంగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కలిగిన లబ్ధి వివరాలను చంద్రబాబు తన వద్ద ఉంచుకోవడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ఆశ చూపించి పలువురిని పార్టీలో చేర్చుకున్నారు. తీరా సీట్లు పెరగకపోవడంతో చంద్రబాబు రూటు మార్చారు.

సీట్ల కేటాయింపు విషయంలో తేడా వచ్చి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగితే ఈ మొత్తం చిట్టాను చూపించి దారికి తెచ్చుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఫిరాయింపుదారుల్లో పలువురికి సీట్లు కేటాయించే అవకాశం లేదని, సర్వే ప్రకారమే సీట్లు కేటాయిస్తానని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. మంత్రి అఖిలప్రియ ప్రాతినిధ్యం వహించే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూడా సర్వే ప్రకారమే సీటు ఇస్తానని చంద్రబాబు కుండబద్దలు కొట్టిచెప్పారు.  

మరిన్ని వార్తలు