మోదీనే ట్రాప్‌లో పడ్డారు.. చంద్రబాబు ఎదురుదాడి!

26 Jul, 2018 19:08 IST|Sakshi

సాక్షి, కొవ్వూరు : అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక టీడీపీ అధినాయకత్వం సతమతమవుతోంది. ప్రత్యేక హోదా వద్దంటూ తొలుత ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు.. ఆ తర్వాత మాట మార్చి యూటర్న్‌ తీసుకున్నారని, ఈ విషయంలో ఆయన వైఎస్సార్‌సీపీ ట్రాప్‌లో పడ్డారని ప్రధాని మోదీ ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక.. తాజాగా చంద్రబాబు ఎదురుదాడి మొదలుపెట్టారు.

ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్‌ సీపీ ట్రాప్‌లో తాను పడలేదని, ప్రధాని మోదీనే ట్రాప్‌లో పడ్డారని ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఉండి తెలుగువాడి సత్తా చూపిస్తామని చెప్పిన చంద్రబాబు. టీడీపీ ఎంపీలు మాత్రం రాజీనామా చేయరని అన్నారు. అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై పోరాటం చేస్తామని చెప్పారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

విభజనతో నష్టపోయిన ఏపీకి అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మొదటినుంచి అవకతవక వైఖరిని అవలంబించారు. ఆయన హోదా కాదని ప్యాకేజీకి స్వాగతించడమే కాక.. ఈ విషయంలో ప్రధాని మోదీని, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీలకు అభినందనలు తెలిపారు. చంద్రబాబు ఒకవైపు ప్రత్యేక హోదాను ఖూనీ చేసేవిధంగా ప్రవర్తించినా.. వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం మొక్కవోని పట్టుదలతో, నిరంతర పోరాటాలతో హోదా ఆకాంక్షను ఆయన సజీవంగా నిలిపారు. అలుపెరగని పోరాటాలతో ఇటు చంద్రబాబు ప్రభుత్వంపై, అటు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.  ఈ క్రమంలో మొదట ప్యాకేజీ కోసం పాకులాడిన చంద్రబాబును.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన యూటర్న్‌ రాజకీయాలను తెరపైకి తెచ్చి.. ఇటీవల హోదా నినాదం ఎత్తుకొని ఆర్భాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్‌ జగన్‌ ట్రాప్‌లో తాను పడ్డానని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక.. కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఏకంగా మోదీని ట్రాప్‌లో పడ్డారని ఆయన ఎదురుదాడి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా