అసెంబ్లీ సీట్లు పెంచకుండా అన్యాయం చేశారు

17 Mar, 2018 02:02 IST|Sakshi

శాసన మండలిలో కేంద్రంపై సీఎం చంద్రబాబు విమర్శలు

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపు హామీని అమలు చేసేందుకు ఒక్క పైసా ఖర్చు చేసే పని లేకున్నా కేంద్రం అది కూడా పట్టించుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. రాజకీయంగా టీడీపీ బలపడుతుందనే ఉద్దేశంతోనే సీట్లను పెంచలేదని ఆరోపించారు. శుక్రవారం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన అనంతరం చంద్రబాబు శాసనమండలిలో మాట్లాడుతూ కేంద్రం, బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాలుగేళ్లు గడిచినా ఏ సమస్యా పరిష్కారం కాలేదని, హామీలన్నీ నీరుగార్చారని చెప్పారు. ఇది తన అసమర్థత కాదని, కేంద్రం ఇవ్వకపోవడమే దీనికి కారణమన్నారు. 

బీజేపీతో పొత్తుతో నష్టపోయాం : ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారని, రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఇదే సంగతి చెబుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు వల్ల గత ఎన్నికల్లో టీడీపీ తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. అంతకుముందు జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే టీడీపీకి 120కి పైగా అసెంబ్లీ సీట్లు రావాల్సి ఉండగా పొత్తుల వల్ల 106 స్థానాలకు పడిపోయిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తన త్యాగానికి ఫలితం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.

కేంద్రం ఆటలు సాగనివ్వం: రాష్ట్రంలోనూ తమిళనాడు తరహాలో రాజకీయాలు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ ఆటలు ఇక్కడ సాగనివ్వం అని కేంద్రంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రధాని మాట మేరకే ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టానని పన్నీర్‌ సెల్వం ప్రకటించారంటే ఎంత దారుణ రాజకీయాలు చోటు చేసుకున్నాయో అర్ధం చేసుకోవాలన్నారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీల చేత రాజీనామాలు, పవన్‌కళ్యాణ్‌తో ఆమరణ నిరాహార  దీక్ష చేయించిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి వారిని హీరోలుగా చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయన్నారు. 

మరిన్ని వార్తలు