అవిశ్వాసం పెట్టినా ఫలితం లేకుండా పోయింది

21 Jul, 2018 02:50 IST|Sakshi

మీడియాతో సీఎం చంద్రబాబు 

సాక్షి, అమరావతి: ‘‘ఎన్డీయే ప్రభుత్వానికి బలం ఉందని తెలుసు. అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోదనీ తెలుసు.. కానీ రాష్ట్రానికి న్యాయం కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టాం.. అయినా ఫలితం లేకుండా పోయింది’’అని సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన అనంతరం శుక్రవారం అర్ధరాత్రి ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అహంకారంతో అవిశ్వాస తీర్మానం పెట్టారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనడం సరికాదని, అధికారం ఉందనే ధీమాతో ప్రధానే అహంకారంతో మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘‘నాకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గొడవలున్నాయని ప్రధాని మాట్లాడారు. ఆయన అలా చెప్పడం కరెక్టు కాదు. ఏపీ, తెలంగాణ మధ్య గొడవలు లేకుండా నన్ను, కేసీఆర్‌ను కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పినా ప్రధాని పట్టించుకోలేదు. సమస్యను పరిష్కరించాలని చెబితే ఆ కోణంలో ఆలోచించకుండా రాజకీయ ఎదురుదాడి చేస్తున్నారు’’అని మండిపడ్డారు.

ప్రధాని చులకనగా మాట్లాడారు..
రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఎంతో ఆసక్తిగా, ఈసారైనా న్యాయం చేస్తారని చూసినా నిరాశే ఎదురైందని చంద్రబాబు అన్నారు. ‘‘ఏపీ అంటే ప్రధాని చులకనగా మాట్లాడారు. నేనేదో యూటర్న్‌ తీసుకున్నానని చెబుతున్నారు. ప్రధాని మోదీని ఎదుర్కోవడానికి, ఆయన్ని గద్దె దించడానికే అవిశ్వాసం పెట్టినామట... అహంకారంతో నో కాన్ఫడెన్స్‌ పెట్టామట.. అహంకారం నాకు కాదు. ప్రధానికే’’అని ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరుతూ అన్ని ప్రయత్నాలు చేశామని, ఫలితం లేకపోవడంతో చివరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానం పెట్టామని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందని చెప్పే ప్రధానమంత్రి నాలుగేళ్లుగా ఒక్కపని కూడా చేయకుండా అన్యాయం చేయలేదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం నిబంధనలు అడ్డువచ్చాయని ప్రధాని చెప్పడం సరికాదన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి చవకబారుగా మాట్లాడటం చూసి బాధవేసిందన్నారు. రాష్ట్రానికి న్యాయం చేస్తానని కనీసం 10 నిమిషాలు ఎందుకు మాట్లాడలేకపోయారని ప్రధానిని నిలదీశారు. ‘‘ఆ అహంభావం ఎందుకు? అరవై ఏళ్లు కష్టపడ్డాం. న్యాయం చేయమని అడిగాం. అందులో తప్పేముంది? రాష్ట్ర విభజన జరిగినా అందరం కష్టపడి రెండంకెల వృద్ధి రేటు సాధించాం. అయినప్పటికీ దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలకంటే ఆదాయంలో వెనుకబడి ఉన్నాం.. ఆదుకోవాల్సిన బాధ్యత మీకు లేదా?’’అని సీఎం అన్నారు. న్యాయం చేయాలని 29 పర్యాయాలు ఢిల్లీ చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదన్నారు. 

ప్యాకేజీకి అంగీకరించింది అందుకే..
ప్రత్యేక హోదాకు ఇచ్చే అన్ని రకాల ప్రయోజనాలతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించామని చంద్రబాబు పేర్కొన్నారు. చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అన్ని పార్టీలు ఒక్కటయ్యాయని, ఇది ఎంతో అరుదైన విషయమని అన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని, న్యాయం జరిగేవరకూ ఆందోళ నలు చేస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. శనివారం రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను ఢిల్లీ వెళ్లి అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపి, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నేషనల్‌ మీడియాకు వివరిస్తానని చెప్పారు.  

మరిన్ని వార్తలు