ఓటుకు కోట్లు కేసు.. చంద్రబాబు మంతనాలు!

8 May, 2018 16:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం లంచ్‌ బ్రేక్‌లో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీనియర్‌ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, అయన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసులో మళ్లీ కదలిక రావడం, ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చేదిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో కీలక సమావేశం నిర్వహించిన నేపథ్యంలో చంద్రబాబు భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నోటుకు కోట్లు కేసు విషయంలో రాజకీయంగా ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఈ సమావేశంలో మంత్రులతో చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తోంది.

మాకు భయం లేదు: సోమిరెడ్డి
మరోవైపు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసుపై స్పందించారు. ఈ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబుపై ఎలాంటి కేసు లేదని, గతంలో హైకోర్టు కూడా ఈ విషయం స్పష్టం చేసిందని ఆయన అన్నారు. ఓటుకు కోట్లు కేసుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీక్ష చేసినంతమాత్రాన ఏమీ కాదని అన్నారు. ఓటుకు కోట్లు కేసుపై తమకెలాంటి భయం లేదని చెప్పారు. మత్తయ్య పిటిషన్‌ సమయంలో దీనిపై క్లారిటీ ఇచ్చిందని తెలిపారు.

మరిన్ని వార్తలు