చంద్రబాబుకు మానసిక స్థితి లోపించిందా?

27 Jan, 2018 18:38 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌ సీపీ నేత జోగి రమేష్‌

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు వింటుంటే సూర్యుడిని ఎప్పుడూ చూడనట్లు దావోస్‌లో సూర్యుడిని కనుగొని వచ్చి ఇక్కడ జనానికి చెబుతున్నట్లు ఉందని వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. ఆయన శనివారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘ సీఎం చంద్రబాబు దావోస్‌ వెళ్లి వచ్చి సూర్యుడు ప్రాధాన్యతలు చెబుతున్నారు. అనాదిగా సూర్య నమస్కారం చేయడం మన సాంప్రదాయం. అది మన సనాతన ధర్మం. అలాంటిది చంద్రబాబు దావోస్‌ వెళ్లివచ్చి...ప్రతి ఒక్కరూ సూర్య ఆరాధన చేయాలని కొత్తగా చెప్పడం హాస్యాస్పదం.

చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు మానసిక స్థితి లోపించిందా?. లేక మైండ్‌ దావోస్‌లో ఏమైనా వదిలి వచ్చారా అనే అనుమానం కలుగుతోంది. దావోస్‌ మోజులో పడి గణతంత్ర వేడుకలకు కూడా హాజరు కాలేదు. ఈ దేశంలో గణతంత్ర వేడుకలకు హాజరు కానీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా?. దావోస్‌ పర్యటన సందర్భంగా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి చంద్రబాబు. లోకేశ్‌ దావోస్‌ నుంచి అమెరికా ఎందుకు వెళ్లాడు?. దావోస్‌లో వచ్చిన సూట్‌కేసులు దాచుకోడానికా?.

తల్లికి వందనం అని చెబుతున్న చంద్రబాబు...మరి తల్లిదండ్రులు లాంటి ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతికి చేసిన ద్రోహం అందరికీ తెలుసు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి మానసికంగా హింసించి చంపిన వైనం చరిత్రలో ఎవరూ మరచిపోరు. జలహారతి అంటున్న చంద్రబాబు గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 22మందిని, పర్మిట్లు లేని బోట్లను తప్పి ఇబ్రహీంపట్నంలో మరో 20మందిని పొట్టన పెట్టుకున్నావు. ఇక చంద్రబాబు వ్యవసాయమే దండగ అంటే మంత్రి దేవినేని ఉమ మరో అడుగు ముందుకు వేసి వరి పండించే రైతుల్ని సోమరిపోతులంటున్నారు. దేవినేని చినప్పటి నుంచి ఏంతిని పెరిగాడు. రైతులను ఇష్టమెచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.’ అని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు