కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు: ఎదురుదాడి చేద్దాం

3 May, 2018 03:40 IST|Sakshi

     2 నెలలు ప్రారంభోత్సవాలతో హంగామా సృష్టిద్దాం

     20న విశాఖలో ధర్మపోరాట రెండో సభ 

     28 నుంచి మహానాడు: చంద్రబాబు

సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనపై ఎదురుదాడి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. తిరుపతిలో తాము నిర్వహిస్తున్న సభను హైజాక్‌ చేయడానికే ఆ రోజు ఈ ప్రకటన చేసినట్లు ప్రచారం చేయాలని చెప్పారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో రాబోయే రోజుల్లో నిర్వహించాల్సిన పార్టీ కార్యకలాపాల క్యాలెండర్‌ను రూపొందించారు. ప్రజల్లో ప్రత్యేక హోదా ఉద్యమ భావన బలంగా ఉన్న నేపథ్యంలో రాబోయే 2 నెలలు ప్రారంభోత్సవాలు, కార్యక్రమాలతో హడావుడి చేసి ప్రజల దృష్టిని మరల్చాలని ఆ పార్టీ నిర్ణయించింది.

ప్రత్యేక హోదా డిమాండ్‌తో ధర్మపోరాట సభలను వచ్చే ఏడాది జనవరి వరకూ 12 జిల్లాల్లో 12 చోట్ల నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది. అలాగే ప్రభుత్వపరంగా వారానికో భారీ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టాల నిర్ణయించారు. తిరుపతిలో నిర్వహించిన తరహాలో ధర్మపోరాట రెండో సభను ఈ నెల 20వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. ఆ తర్వాత వరుసగా మిగిలిన జిల్లాల్లో సభలు నిర్వహించి చివరిగా వచ్చే ఏడాది జనవరిలో అమరావతిలో ముగింపు సభ నిర్వహించేలా ప్రణాళిక తయారు చేశారు.

ఈ నెల 28న జాతీయ మహానాడును విజయవాడలో నిర్వహించాలని పార్టీ నాయకులకు సూచించారు. దళిత తేజం ముగింపు సభను గుంటూరులో నిర్వహించాలని, దళిత తేజం తరహాలోనే ముస్లిం మైనారిటీ రోష్నీ(తేజం) కార్యక్రమాన్ని, ఆ తర్వాత గిరిజన తేజం పేరుతో సభలు నిర్వహించనున్నారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. 40 ఏళ్లలో చేయలేని పనుల్ని నాలుగేళ్లలో చేశాననే సంతృప్తి ఉందన్నారు. డబ్బులు లేకపోయినా పోలవరం, రాజధాని నిర్మాణాలను చేపట్టామన్నారు. 

మరిన్ని వార్తలు