అవిశ్వాసంపై ఎట్టకేలకు దిగొచ్చిన చంద్రబాబు

15 Mar, 2018 18:36 IST|Sakshi
అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

మద్దతు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటన

సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానంపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగొచ్చారు. కేంద్రంపై వైఎస్‌ఆర్‌సీపీ అవిశ్వాసానికి ప్రతిపక్ష పార్టీలు మద్దతునిస్తుండటం.. అవిశ్వాసానికి మద్దతునివ్వాలంటూ అన్ని వర్గాల నుంచి ఒత్తిడి వస్తుండటంతో చంద్రబాబు కూడా తలొగ్గారు. వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రంపై శుక్రవారం ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్టు చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముమ్మరంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోరాటంలో భాగంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు, ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంటు సాక్షిగా ఎలుగెత్తేందుకు అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్టు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదట ఈ నెల 21న కేంద్రం అవిశ్వాసం ప్రవేశపెట్టాలని భావించినా.. అప్పటివరకు పార్లమెంటు సమావేశాలు కొనసాగే అవకాశాలు లేవని తెలుస్తుండటంతో రేపే (శుక్రవారం) అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతును వైఎస్‌ఆర్‌సీపీ కూడగట్టింది. ఈ నేపథ్యంలో అవిశ్వాసంపై వైఖరి తెలుపకుండా ఇన్నాళ్లు కప్పదాటు ధోరణి అవలంబించిన చంద్రబాబు.. ప్రజలు, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వస్తున్న ఒత్తిడికి దిగొచ్చారు. హోదా కోసం ఆంధ్ర ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తూ.. వైఎస్‌ఆర్‌సీపీ పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో తాజాగా చంద్రబాబు కూడా దిగొచ్చి కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నట్టు తెలపడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు