ఎంపీలను సన్నద్ధం చేయండి

19 Jul, 2018 03:19 IST|Sakshi

వారు అడిగే వివరాలన్నీ ఇవ్వండి

అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌ 

ఢిల్లీ వెళ్లనున్న యనమల

సాక్షి, అమరావతి: పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చకు ఎంపీలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఆమోదించిన తర్వాత ఆయన సచివాలయంలో బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. అలాగే ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎంపీలకు అవసరమైన సమాచారం మొత్తం ఇవ్వాలని అధికారులకు సూచించారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కూడా మిగతా పార్టీల మద్దతు ఉండేలా చూడాలని ఎంపీలకు సూచించారు.

చర్చకు పది గంటల సమయం ఇచ్చే అవకాశం ఉందని, పార్టీ బలాబలాలను బట్టి చర్చా సమయం ఉంటుందన్నారు. చర్చలో ముగ్గురు సభ్యులు మాట్లాడే అవకాశం రావచ్చని, సమయం చాలకపోతే ప్రసంగం లిఖిత ప్రతిని స్పీకర్‌కు ఇవ్వాలని ఎంపీలకు సూచించారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలను కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు ముఖ్యమంత్రికి వివరించారు. కాగా ఎంపీలకు సహకరించేందుకు గురువారం ఢిల్లీ వెళ్లాలని ఆర్థిక మంత్రి మంత్రి యనమల రామకృష్ణుడిని ముఖ్యమంత్రి ఆదేశించారు.  అవిశ్వాసంపై చర్చ ముగిసేవరకు ఢిల్లీలోనే ఉండనున్నారు. 

రాజధానిలో ప్రైవేటు రంగానికి ప్రత్యేక విధానం   
సీఆర్‌డీఏ సమీక్షలో సీఎం
రాజధాని నగరం అభివృద్ధి పనుల్లో ప్రైవేటు రంగాన్ని ఎలా భాగస్వాముల్ని చేయాలనే అంశంపై వీలైనన్ని ఆప్షన్లని పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో ఆయన రాజధాని పనుల పురోగతిని సమీక్షించారు. వివిధ సంస్థలు, అభివృద్ధిదారుల నుంచి వచ్చిన సూచనలతో ప్రైవేట్‌ భాగస్వామ్య విధానాన్ని రూపొందిస్తున్నామని అధికారులు తెలిపారు. అమరావతిలో ఇండస్ట్రియల్‌ పార్కును అభివృద్ధి చేసి నిర్వహించేందుకు మహీంద్రా గ్రూపు ముందుకొచ్చిందని చెప్పారు. రూ.26 వేల కోట్ల మేర రాజధానిలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ఎలా సమకుర్చుకోవాలన్న అంశంపై సమావేశంలో వివిధ అంశాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు.

సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సులభంగా ఉండాలి 
సంక్షేమ పథకాలకు అర్హతలను బట్టి లబ్ధిదారులను ఎంపిక చేసే విధానం సులభంగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన సంక్షేమ శాఖల పనితీరును సమీక్షించారు. ప్రభుత్వంలోని ప్రతి విభాగం కూడా ‘గ్రామదర్శిని’ కార్యక్రమం కోసం తగిన తాజా సమాచారంతో సిద్ధం కావాలని ఆదేశించారు. చంద్రన్న పెళ్లి కానుక పథకం అమలులో వివాహ ధ్రువీకరణ పత్రం లేనివారికి కూడా కానుక ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాలు, అన్నక్యాంటీన్లు, ఎన్టీఆర్‌ గృహనిర్మాణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో ఒక అన్న క్యాంటీన్‌ నెలకొల్పాలని ఆదేశించారు. అన్న క్యాంటీన్లను ప్రమోట్‌ చేయడానికి సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవాలన్నారు. 

మరిన్ని వార్తలు