మరో పదేళ్లు నేనే సీఎం

16 Sep, 2019 02:33 IST|Sakshi

శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: ‘‘నాకు చాలామంది మిత్రులున్నరు. కేసీఆర్‌ ఆరోగ్యం ఖతమైందట గదా.. అమెరికాకు పోతడట గదా.. అని ఇరవై ఏళ్ల నుంచి చెప్తున్నరు. నేను సచ్చిపోబట్టి 20 ఏళ్లు అయె. నేనేం సావలె. ఇప్పుడు కూడా నాకేమైంది.. దుక్కలా ఉన్న. కేసీఆర్‌ దిగిపోయి కేటీఆర్‌ను దించుడు పక్కానేనా అని ఇప్పుడు కూడా అడుగుతున్నరు. నేనెందుకు చేస్తా. నాకర్థం కాదు. నాకు పాణంవాటం లేదా? ఏమైందని?, మంచిపనులు చేస్తున్నం కాబట్టి వంద శాతం ప్రజల కోసం తిప్పలు పడుతున్నం. కాబట్టి ఇంకా పడ్తం,  గ్యారంటీగా 100కు 100 శాతం టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ టర్మ్‌ ఆవల కూడా రెండు టర్ములుంటది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు నాకు 66 ఏండ్లు. ఇంకా పదేళ్లు అయినా చేయనా? ఈ టర్మ్‌ నేనే ఉంటా. వచ్చే టర్మ్‌ కూడా నేనే ఉంటా. యాడికి పోను. నేను చెప్పినవన్నీ జరిగినవి. ఇది కూడా జరుగతది’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘మీరెన్ని శాపాలు పెట్టినా, నేను గట్టిగానే ఉంట.. పనిచేస్తేనే ఉంట. ప్రజల దీవెన.. దేవుని దయ’ అని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రీడిజైనింగ్‌పై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క చేసిన ఆరోపణలపై ఆది వారం శాసనసభలో సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘ఏది పడితే అది, అడ్డగోలు విమర్శలు చేస్తే మంచిది కాదు’ అని భట్టికి సూచించారు. చిల్లర రాజకీయాల కోసం మన సొంత రాష్ట్రానికి శాపనార్థాలు పెట్టవద్దని కోరారు. ‘అలా కోరుకోవడం దుర్మార్గం. సీఎం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలి. ఆయన పరిపాలనలో రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటున్నాం’అని భట్టి విక్రమార్క సీఎం వ్యాఖ్యలకు బదులిచ్చారు. 

‘ప్రాణహిత’ బులిబుచ్చికాయల ప్రాజెక్టు
‘ఎక్కడ ప్రాణహిత, ఎక్కడ తమ్మిడిహెట్టి. ఎక్కడ చేవెళ్ల. మన మునిమనమళ్లు కూడా నీళ్లు చూడరని అప్పుడే చేవెళ్లలో జరిగిన ఓ సభలో చెప్పిన. తమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవు. అక్కడ 152 మీటర్ల ఎత్తు కాడ డ్యాం కట్టితే మహారాష్ట్ర కాడ కొంత ముంపు వస్తుంది. అయినా ఆడ ఉండే నిల్వ 6 టీఎంసీలే. ప్రాణహిత–చేవెళ్ల కింద ప్రతిపాదించిన ఆయకట్టు 16 లక్షలు. మొత్తం నిల్వ కలిపి 16 టీఎంసీలు. అందులో 11 టీఎంసీలతో చెరువులు నింపి పారిస్తే 16 లక్షల ఎకరాలు పంట పండుతుందా?’’అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.  సమైక్య పాలకులు ఇలా ఏ విషయమైనా గోల్‌ మాల్‌ తప్ప ధర్మంగా చేయలేదని విమర్శిం చారు. ‘‘చంద్రబాబు బాబ్లీ చూపించి లొల్లి పెట్టిండు.

రాజశేఖరరెడ్డి తమ్మిడిహెట్టి చూపించాడు. అసలు నీళ్లున్న మేడిగడ్డ చూపించింది టీఆర్‌ఎస్సే’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.  ‘‘తమ్మిడిహెట్టి డ్యాం ను 152 మీటర్లకు కట్టేందుకు మహారాష్ట్ర అనుమతించలేదు. 148 మీటర్లకు కట్టినట్లయితే 40, 42 టీఎంసీలకు మించి నీళ్లురావని సీడబ్ల్యూసీ స్పష్టంగా చెప్పింది.  ఆ ప్రాజెక్టు రీడిజైన్‌కు కారణం మేం కాదు.. సీడబ్ల్యూసీ. పాత ‘ప్రాణ హిత– చేవెళ్ల’కు అనుమతి ఇవ్వబో మని 2015లో సీడబ్ల్యూసీ నిరాకరించింది. ప్రత్యామ్నాయ ప్రతిపాదన లకు వెళ్లాలని కోరింది. రాబడి పెరు గుతుందనే డిజైన్‌ మార్చామని కొంద రంటనే కోపం వచ్చింది. దుఃఖం కలిగింది’’అని కేసీఆర్‌ అన్నారు.   సీతారామను నిర్మిస్తే ఖమ్మంలో 15 లక్షల ఎకరాలు పండితే రైతులు లాభపడతారని, తెలంగాణకు ప్రయో జనంలేదని దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌ను రద్దు చేశామన్నారు.

తెలంగాణ హక్కును చాటుకోవడానికే
‘‘సీతారామ ద్వారా ఎంత అంటే అంత, దేవాదుల ద్వారా 75, కాళేశ్వరం ద్వారా 400 కలిపి 530 టీఎంసీలు తీసుకునే అవకాశం వచ్చింది. ఊరికనే కాళేశ్వరం ప్రారంభోత్సవం చేయలేదు. తెలంగాణ రాష్ట్ర హక్కును సృష్టించడానికి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్, ఎగువ, దిగువ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించి, ముగ్గురు ముఖ్య మంత్రులను పిలిచి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసిన’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.  వచ్చే జూన్‌కు 40 లక్షల ఎకరాలు పారుతదన్నారు. 

కాళేశ్వరం నిర్వహణ ఇలా..    
‘‘శ్రీరాంసాగర్‌ నిండితే మేడిగడ్డ దగ్గర మోటార్‌ ముట్టం. ఎస్సారెస్పీ నుంచి మిడ్‌మానేరు, ఎల్లంపల్లికి లింక్‌ ఉంది. మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్‌కు లింక్‌ ఉంది. ఎల్లంపల్లి పంప్‌ కూడా ముట్టం. కేవలం రెండు పంపులు నడుస్తాయి. మీది నుంచి నీళ్లు వస్తే అలా వ్యూహం. అదృష్టవశాత్తు స్థానికంగా బాగా నీళ్లువస్తే కాళేశ్వరం, మేడిగడ్డ పోము. అవి నిండి ఉంటయి. ఎల్లంపల్లి నుంచి నడుపుకుంటం. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు వస్తే మిడ్‌మానేరు నుంచి నడుపుతం. కింద పంపులు నడపం. కరెంట్‌ బిల్లులు రావు. అక్కడ నీళ్లు రాకపోతే ఎల్లంపల్లి నుంచి నడుపుకుంటం. అక్కడ కూడా రాకపోతేనే మేడిగడ్డకు పోతం. అక్కడ 1,740 టీఎంసీల సగటు ప్రవాహం ఉంది. మల్లన్నసాగర్‌ను సింగరూకు లింక్‌ చేస్తే సింగూరు రైతాంగ సమస్యలు తీరుతయ్‌. దీనికి ఆలోచన చేస్తున్నం’’అని కేసీఆర్‌ తెలిపారు. 

కేంద్ర చట్టం మేరకు చలానాలు పెంచం
ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ విషయంలో విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ట్రాఫిక్‌ చలానాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మోటారు వాహనాల చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేయబోమన్నారు. రాష్ట్రమే కొత్త చట్టాన్ని తీసుకురానుందని, దీనికి తొందరేంలేదని స్పష్టం చేశారు. ఎంఐఎం సభ్యుడు మౌజంఖాన్‌ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం బదులిచ్చారు. 

జగన్‌లో నిజాయితీ, తపన ఉంది
‘‘నల్లగొండ, పాలమూరు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నరు. గోదావరి నీళ్లు సముద్రంలో వృథాగా పోతున్నయి. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత ఏపీతో సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. కృష్ణానదిలో నీళ్లు గ్యారంటీగా లేవు. ఒక్కోసారి ఐదేళ్ల వరకు సుక్క రాదు. ఉభయ రాష్ట్రాల రైతాంగ ప్రయో జనాల కోసం కృష్ణా–గోదావరి అనుసం ధానం చేద్దామని జగన్‌ను కోరిన. యువకు డైనా ఆయనలో నిజాయితీ ఉంది. రాష్ట్రానికి మంచి చేయాలనే తపన ఉంది.   సహృదయంతో ఇద్దరం పనిచేస్తున్నం. కొద్ది రోజుల్లోగా మల్ల చర్చలు జరుగుతాయి’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.  

మరిన్ని వార్తలు