టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు ఖరారు 

23 Feb, 2019 01:41 IST|Sakshi

నలుగురిని ప్రకటించిన సీఎం కేసీఆర్‌

మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డికి చాన్స్‌

ఐదో స్థానం మిత్రపక్షమైన మజ్లిస్‌కు కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌ : శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారయ్యారు. ఐదు స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ మేరకు శుక్రవారం ప్రకటన జారీ చేశారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశంలకు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణాలు, లోక్‌సభ ఎన్నికలను పరిగణనలోకి తీసుకొని కేసీఆర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్‌ లోక్‌సభ పరిధిలో టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉండే లంబాడీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌కు కేసీఆర్‌ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అలాగే సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాల్లో అధిక సంఖ్యలో ఉండే కురుమ వర్గానికి చెందిన ఎగ్గే మల్లేశంను ఎంపిక చేశారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాజకీయ సలహాదారుడిగా వ్యవహరిస్తున్న శేరి సుభాష్‌రెడ్డి ప్రస్తుతం ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీగా ఆయనకు సీఎం అకాశం కల్పించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మార్చి 12న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు ఇప్పటికే ఖరారయ్యారు. కాంగ్రెస్‌ సైతం అభ్యర్థిని నిలిపితే పోలింగ్‌ జరుగుతుంది.

మరిన్ని వార్తలు