ప్రగతి భవన్‌ నుంచి బయటకు రా!

1 Sep, 2019 07:25 IST|Sakshi
రోగిని పరామర్శిస్తున్న భట్టి, జీవన్‌రెడ్డి, పొన్నం తదితరులు 

పార్టీ కుమ్ములాటలు ప్రజలకు ఎందుకు?

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేత భట్టి ధ్వజం 

అధ్వానంగా ప్రభుత్వ ఆస్పత్రులు

ఐదేళ్లలో ఒక డాక్టర్‌ నియామకం లేదు

కరీంనగర్, పెద్దపల్లి ఆస్పత్రుల సందర్శన 

పెద్దపల్లి/కరీంనగర్‌/కాటారం: ప్రజా వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన కరీంనగర్, పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించారు. ఆస్పత్రిలోని పలు వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులు అధ్వానంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రజలు మీకు రెండు సార్లు అధికారం ఇచ్చారు. కానీ ప్రగతిభవన్‌ గడప దాటడం లేదు.. ఒక్కసారి ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితి చూడండి’’అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం నయా పైసా విడుదల చేయలేదని, డాక్టర్ల రిక్రూట్‌మెంట్‌ జరగలేదని విమర్శించారు.

ప్రజల కష్టాలను పట్టించుకోకుండా పార్టీ కుమ్ములాటలు ప్రజల మీదికి రుద్దే ప్రయత్నం చేస్తున్నరని మండిపడ్డారు. పార్టీలో ఎవరు ఓనర్లు, ఎవరు సైనికుల విషయం ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. అంతర్గత కుమ్ములాటలతో ప్రజాసమస్యలను మర్చిపోయారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఆశించిన మేరకు లేవన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యరంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, ప్రభుత్వం కళ్లు తెరిపించేం దుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులను సందర్శిస్తున్నామని చెప్పారు. వైద్యారోగ్య శాఖ మంత్రి జిల్లాకు చెందిన వాడై ఉన్నప్పటికీ ఇక్కడ రోగులకు కనీస వైద్యం అందడం లేదని విమర్శించారు. తాను ఎవరి నుంచి పైసాకూడా తీసుకోలేదని మంత్రి ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలపై అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. 

కాళేశ్వరం..ఓ పెద్ద స్కాం
కాళేశ్వరం ప్రాజెక్టు వెనుక ఓ పెద్ద స్కాం దాగి వుందని భట్టి విక్రమార్క ఆరోపించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. ఎకరా భూమికి నీరందించకుండానే సీఎం కేసీఆర్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం శోచనీయమన్నారు. ప్రపంచ, ఆర్థిక బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రాజెక్టు పేరిట కోట్లాది రూపాయలు ప్రైవేట్‌రంగ బ్యాంకుల నుంచి అధిక వడ్డీకి అప్పు తెచ్చి అడ్డగోలు దోపిడి చేశారని విమర్శించారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి కేసీఆర్‌ అవినీతి భాగోతాన్ని ఆధారాలతో బయటపెడతామని చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు