ఉత్తమ్‌ ఓటమి ఖాయం.. నల్లగొండ నుంచి పోటీ అనుకున్నా!

3 Dec, 2018 18:48 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: ఎన్నికల తేదీ సమీపిస్తుండటం.. ప్రచారం గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తుండటంతో తెలంగాణ ఆపద్ధరమ్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం నల్లగొండ జిల్లాలో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. కోదాడ, మిర్యాలగూడ, హుజుర్‌నగర్‌, నల్లగొండ తదితర కీలక నియోజకవర్గాల్లో జరిగిన ప్రజాశీర్వాద సభల్లో పాల్గొన్న ఆయన ఈసారి హుజుర్‌నగర్‌లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓడిపోవడం ఖాయమని అన్నారు. హుజుర్‌నగర్‌లో జరిగిన భారీ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. గత తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఉత్తంకుమార్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఈ సభకు వచ్చిన జనాలు చూస్తే.. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు ఖాయమని అనిపిస్తోందన్నారు. సైదిరెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాత ఒకరోజు మొత్తం హుజూర్‌నగర్‌లో ఉండి పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఉత్తమకుమార్‌ రెడ్డి మహా కూటమిని పేరిట నాలుగు పార్టీలను వేసుకొని.. గెలుపొంది సీఎం కావాలని కలలు కంటున్నారని, ఆయన కలలు కల్లలేనని పేర్కొన్నారు. హుజుర్‌నగర్‌ నియోజకవర్గాన్ని మరో గజ్వేల్‌లా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

నల్లగొండ నుంచి పోటీచేద్దామనుకున్నా..
ఈసారి ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేద్దామని అనుకున్నానని, కానీ గజ్వేల్‌ ప్రజలు గోల చేస్తారని, ఇక్కడ నుంచి పోటీ చేయలేకపోయనని కేసీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన నల్లగొండ సభలో ఆయన ప్రసంగించారు. నల్లగొండ నుంచి భూపాల్‌రెడ్డి పోటీ చేయడం సంతోషంగా ఉందని, ఆయనను గెలిపించాలని ప్రజలను కోరారు. నల్లగొండ నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు