ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు : కేసీఆర్‌

24 Oct, 2019 17:55 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్న ఆర్టీసీ భవిష్యత్తులో ఉండబోదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు పిచ్చిపంథాలో సమ్మె చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని, అయిపోయిందని.. ఆర్టీసీ దివాళా తీసిందని సీఎం వ్యాఖ్యానించారు. కార్మికుల భవిష్యత్తుతో యూనియన్లు నాయకులు ఆడుకుంటున్నారని విమర్శించారు. కార్మికులు తక్షణమే దిగిరావాలని లేదంటే ఒక్క సంతకంతో వేల బస్సులను రోడ్లపైకి తీసుకోస్తామని హెచ్చరించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ మెజార్టీతో  విజయం సాధించిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆర్టీసీ యూనియన్ల నాయకులే ఆర్టీసీని ముంచుతున్నారని ఆరోపించారు. యూనియన్ల చిల్లర రాజకీయాలతో ఆర్టీసీకి భారీ నష్టాలు తెచ్చిపెట్టారని మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ ఇంకా ఏమన్నారంటే..

 ఎవరు పడితే వారు గవర్నమెంట్‌లో కలపమంటే ఎలా? 
ఆర్టీసీ కార్మికుల ఎత్తుకున్నది పిచ్చిపంథా. అనవరమైన, అర్థపర్థంలేనటు వంటి పద్దతిని అవలంభించారు.  రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థపై నాకంటే ఎక్కువ అనుభవం లేదు. గతంలో మూడేళ్లు మంత్రిగా పనిచేశా. అప్పుడు ఆ సంస్థ 13కోట్ల 80లక్షల నష్టంలో ఉంది. నేనే కష్టపడి ఆ సంస్థను 14 కోట్ల లాభాల్లోకి తెచ్చా.  నేను ముఖ్యమంత్రి అయ్యాక  వైస్రాయి హోటల్లో ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించాను. వారికి సలహాలు ఇచ్చా.  44శాతం జీతాలు పెంచాం. ఎన్నికలకు కొద్దిరోజు ముందు 14 శాతం ఐఆర్‌ ఇచ్చా. మొత్తంగా 67శాతం జీతాం పెంచాం. చరిత్రంలోనే ఇలా ఎవరూ పెంచలేదు. ఇంత పెంచిన తర్వాత కూడా ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ఎవరు పడితే వారు గవర్నమెంట్‌లో కలపమంటే ఎలా?  వారి తర్వాత మిగతా 57 సంస్థలు కూడా ప్రభుత్వంలో కలపమంటే ఎలా? ఇదే కోర్టులు అప్పుడు మళ్లి మమ్మల్ని ప్రశ్నిస్తాయి. ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి.  ఇదేనా రాజకీయం. బాధ్యతమైన ప్రతిపక్షాలు చేయాల్సిన పనేనా? 

సమ్మె ఎక్కడిది.. ఆర్టీసీయే ముగుస్తోంది
ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ ప్రభుత్వంలో లేదు. 35 ఏళ్లు పాలించిన పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం ఆర్టీసీని మూయలేదా? అక్కడ 200 బస్సులు మాత్రమే ప్రభుత్వానివి ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో  అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌ ఆర్టీసీని మూయలేదా?  వీళ్ల సమ్మె ఏం సమ్మె? అర్థం, ఆలోచన ఉండి చేసిన సమ్మెనా?  ఏ ప్రభుత్వం వచ్చినా సమ్మె చేస్తారు. దిక్కుమాలిన యూనియన్‌ ఎన్నికల కోసం ఇలాంటి సమ్మెలు చేస్తారు. ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడిది.. ఆర్టీసీయే ముగుస్తుంది. ఈ రోజుకి 5వేల కోట్లు అప్పు ఉంది. ఒక నెల కిస్తీ కట్టకుంటే ఆర్టీసీ ముగుస్తుంది. ఫీఎఫ్‌ డబ్బులు కార్మికులకు ఇచ్చే దమ్ము ఆర్టీసీకి లేదు. నెలకు 100 కోట్ల నష్టం. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అన్ని లాభాల్లో ఉంటే.. ఆర్టీసీ మాత్రం నష్టాల్లో ఉంటాయి. ఎందుకు అలా?  ఇదేనా యూనియన్లు చేసే పని.  అద్దెబస్సులు తొలగించండి అంటారు.. టైం ప్రకారం బస్సులు నడిపించాలి. ఆర్టీసీ ని ఎలా కాపాడుతారు. సందర్భం వస్తే ఓ గంట పనిచేస్తే  ఏమవుతుంది. టైంప్రకారం పని దిగిపోతా అంటే ఎలా? ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు. గత ప్రభుత్వాలు 712 కోట్లు ఇస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 4250కోట్లు విడుదల చేశాం. అది కాక ఓ చట్టం తీసుకొచ్చాం. దానిద్వారా 330 కోట్లు వచ్చాయి.  ఏడాదికి 900 కోట్లుకు పైగా ఇచ్చాం. ఇంకేం ఇస్తారు?  ఈ ఏడాది 550 కోట్లు పెట్టాం. 425 కోట్లు విడుదల చేశాం. ఇంకెన్ని ఇవ్వాలి?

హైకోర్టు ఏం చేస్తది?
సాధారణంగా పండగల సమయంలో డబ్బులు ఎక్కువగా వస్తాయి. ఆర్టీసీకి బతుకమ్మ, దసరా చాలా ముఖ్యం. అటువంటి సమయంలో సమ్మెకు పోయారు. ఇదేనా పద్దతి. పలికిమాలిన డిమాండ్లను పెట్టారు. వారి డిమాండ్లపై కమిటీ వేశాం. సీఎస్‌ అధ్యక్షతన చర్చలు జరిపాం. అయినా వినలేదు. ఆర్టీసీ ప్రభుత్వం కలపాలన్నారు. కమిటీ కాదని సమ్మెకు పోయారు. ఇప్పుడు ఏమైంది. ఏం ఫలితం?  సమ్మెకు ముందు ప్రభుత్వం 100 కోట్లు విడుదల చేశారు.  వాటిలో 7 కోట్లు మాత్రమే ఇప్పుడు ఆర్టీసీ దగ్గర ఉన్నాయి. సమ్మె కారణంగా ప్రస్తుతం కూడా నష్టమే వస్తున్నాయి.సెప్టెంబర్‌ నెల జీతాలు ఇవ్వాలంటూ హైకోర్టులో కేసులు వేశారు. ఆర్టీసీకి నిధులు లేవని నివేదించాం. డబ్బులు లేవని చెప్పాం. హైకోర్టు ఏం చేస్తది కొడుతదా? 

బస్సులు, బస్టాండ్లు అమ్మి జీతాలు ఇవ్వాలి
ఆర్టీసీ యూనియన్లు మహానేరం చేస్తున్నారు. అమాయక కార్మికలు గొంతు కోస్తున్నారు. వారిని ఎవరూ కాపాడలేరు. వందశాతం ఆర్టీసీ ఇప్పుడు ఉన్నట్లు ఉండదు.  మోదీ ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం.. ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వాని సంపూర్ణ అధికారాలు ఇచ్చారు. ఆర్టీసీలో పోటీని పెంచాలని సూచించారు. ఆర్టీసీకి పోటీదారిని సృష్టించమని అధికారాలు ఇచ్చారు. సెప్టెంబర్‌ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. మేము అదే చేస్తాం. హైకోర్టుకు తీర్పు చెప్పే హక్కు లేదు. లేబర్‌ కోర్టుకు వెళితే ఆస్తులు అమ్మి జీతాలు ఇవ్వమంటారు. అప్పుడు బస్సులు, బస్టాండ్లు అమ్మి జీతాలు ఇవ్వాలి. ప్రభుత్వం ఇవ్వదు. బుద్దిఉన్న ఏ వ్యక్తి  ఇలాంటి సమ్మె చేయరు. నా దృష్టింలో ఆర్టీసీ పని అయిపోయింది. వారిపై ఎస్మా ఉన్నా కూడా సమ్మెకు పోయారు. ఇది చట్టవిరుద్ధ చర్య. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బుల్లేవు. బ్యాంకులు అప్పులు ఇవ్వరు. వెయ్యిశాతం పాత ఆర్టీసీ ఉండదు. ఈ యూనియన్లే ఆర్టీసీని ముంచాయి. ఇకపై కూడా ఇలాంటి యూనియన్లు ఉండి ఇదే గొంతెమ్మ కోరికలు కోరితే ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు. కార్మికులతో నాకు ఎలాంటి విబేధాలు లేవు. యూనియన్లు లేకుండా ఆర్టీసీ పనిచేస్తే కచ్చితంగా లాభాల్లోకి వస్తుంది. ఆర్టీసీ సమ్మెకు ముంగింపు ఆర్టీసీ ముగింపే జవాబు. తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులే కాదు అందరూ పనిచేశారు. కొద్దిరోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులకు రాకుండా చూసుకుంటాం. ఆర్టీసీ సంఘాలు తక్షణం దిగిరావాలి లేదంటే ఒక్క సంతకంతో 7వేల బస్సులకు పర్మిషన్లు ఇస్తాం​’  కేసీఆర్‌ హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు