వరాల ప్రకటన కోసం.. అసెంబ్లీ రద్దు కోసం..

28 Aug, 2018 01:08 IST|Sakshi

నేడు మంత్రివర్గ భేటీ?

‘ప్రగతి నివేదన’ తర్వాత అసెంబ్లీ రద్దు కోసం మరోసారి సమావేశం

ఏర్పాట్లు చేస్తున్న సాధారణ పరిపాలనశాఖ..

పెండింగ్‌ పనుల వివరాలు పంపాలని ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా ఆదేశం

వచ్చే నెల తొలి వారంలో 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు!

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి ముందే రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించేందుకు ఒకసారి, అసెంబ్లీని రద్దు చేస్తూ తీర్మానించేందుకు మరోసారి కేబినెట్‌ భేటీ జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కేబినెట్‌ భేటీలో చర్చించే అంశాల ప్రతిపాదనలు పంపాలని సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా సోమవారం అన్ని శాఖలకు లేఖ రాశారు. సోమవారం సాయంత్రంలోగా వాటిని పంపించాలని స్పష్టం చేశారు.

దీంతో అన్ని శాఖల అధికారులు హుటాహుటిన తమ పరిధిలోని పెండింగ్‌ అంశాలు, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల ప్రతిపాదనల వివరాలను సాధారణ పరిపాలనశాఖకు పంపించారు. దీంతో కేబినెట్‌ భేటీ ఎప్పుడన్న దానిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనను ముగించుకుని సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. అన్ని వివరాలను పరిశీలించుకుని మంత్రివర్గ సమావేశంపై నిర్ణయించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం ఉండొచ్చని అధికార వర్గాలు చెప్పాయి. అయితే సోమవారం రాత్రి వరకు దీనిపై మంత్రులకు సమాచారం అందలేదు. టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల మూడు నెలల పాలనలో ప్రారంభించని కార్యక్రమాలతోపాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ, పెండింగ్‌లో ఉన్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అధికారికంగా అన్నీ సిద్ధమయ్యాయి.

ప్రగతి నివేదన సభ తర్వాత...
తెలంగాణ రాష్ట్ర సమితి సెప్టెంబర్‌ 2న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రగతి నివేదన సభ’వేదికపైనే ముందస్తు ఎన్నికల ఆవశ్యకత గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందనిపార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం ఒకటి రెండు రోజుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించి శాసనసభ రద్దుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. శాసనసభ రద్దు ప్రతిపాదనను గవర్నర్‌కు నివేదించడం, ఆ తర్వాత శాసనసభ రద్దుపై అధికారిక నిర్ణయాలు జరగనున్నాయి. ఇదే సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్‌ కోరనున్నారని తెలిసింది. అనంతరం ముందస్తు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ మొదలుకానుంది. అనుకున్న సమయానికి ముందస్తు ఎన్నికలు జరిగేందుకు వీలుగానే ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయాలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ భేటీపై రాని స్పష్టత...
శాసనసభ రద్దుకు ముందు అసెంబ్లీ సమావేశాలు జరిగే విషయంలో ఇంకా స్పష్టత రావడంలేదు. బడ్జెట్‌ సందర్భంగా మార్చి 29న అసెంబ్లీ చివరిసారి సమావేశమైంది. ఆరు నెలలలోగా కచ్చితంగా అసెంబ్లీ భేటీ జరగాల్సి ఉన్న నేపథ్యంలో సెప్టెంబర్‌ 27లోగా శాసనసభ సమావేశం నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని తెలిసింది. శాసనసభ రద్దు నిర్ణయానికి ముందు రెండురోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్‌ మొదటి వారంలోనే ఈ సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం జరిగే అవకాశం ఉన్న మంత్రివర్గ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

జోనల్‌ నిర్ణయం కీలకం...
రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న కొత్త జోనల్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి ఆమోదం అనంతరం దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో అధికారిక నిర్ణయం వెలువడుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. కొత్త జోనల్‌ విధానంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రస్తుత ఉద్యోగులకు పదోన్నతుల రూపంలో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.

అంతటా అదే చర్చ...
రాష్ట్రంలో అంతటా ముందస్తు ఎన్నికల చర్చే జరుగుతోంది. సచివాలయంలోని మంత్రుల పేషీలు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, ఆఖరికి సచివాలయంలోనూ ముందస్తు ఎన్నికల గురించే మాటముచ్చట్లు జరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు? ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై ఎవరికి వారు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌ అయింది. అన్ని చర్చలకు, సందేహాలకు మరో వారం రోజుల్లో తెరపడుతుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో అప్పటి వరకు ఇదే చర్చ కొనసాగనుంది. 

మరిన్ని వార్తలు