రెండు నెలల్లో ప్రధాని మోదీతో మూడోసారి..!

25 Aug, 2018 12:46 IST|Sakshi

నేడు సాయంత్రం ప్రధానితో కేసీఆర్‌ సమావేశం

ఢిల్లీలో బిజీబిజీగా పర్యటన

‘ముందస్తు’పై సస్పెన్స్‌కు తెరపడే అవకాశం

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బిజీబిజీగా గడుపుతున్నారు. శుక్రవారం పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యవర్గ సభ్యులతో భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతోపాటు ఎంపీలు బీ. వినోద్‌కుమార్, జె. సంతోష్‌ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ జోషి తదితరులు ఉన్నారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. రెండు నెలల వ్యవధిలో మూడుసారి మోదీతో ఆయన సమావేశం అవుతుండటం గమనార్హం. కొత్త జోన్ల ఏర్పాటుకు ఆమోదం, హైకోర్టు విభజన అంశాలపై ఆయన ప్రధాని మోదీతో చర్చించనున్నారు. 7 లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో సాయంత్రం 4.10 గంటలకు జరగనున్న ఈ భేటీలో దాదాపు 14 అంశాలపై చర్చించే అవకాశముంది. నూతన జోనల్‌ విధానమే ప్రధాన ఎజెండాగా సీఎం కేసీఆర్‌, ప్రధాని మోదీతో మాట్లాడనున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులనూ సీఎం కేసీఆర్‌ కలిసే అవకాశముంది. ప్రధానితో సీఎం కేసీఆర్‌ భేటీ తర్వాత రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న జోనల్‌ వ్యవస్థకు కేంద్రం ఆమోదం అంశం సహా మరికొన్నింటిపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు