కారులో హుషారు

8 Apr, 2019 07:27 IST|Sakshi

నేడు వికారాబాద్‌కు సీఎం కేసీఆర్‌ సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ

విజయవంతం చేసేందుకు పార్టీ నాయకుల ప్రణాళిక

1.50 లక్షల మంది జన సమీకరణపై దృష్టి

గత హామీల స్పష్టతపై ప్రజల ఎదురుచూపులు

సాక్షి, వికారాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకెళ్తోంది. ఎన్నికలకు మరో నాలుగు రోజుల సమయమే ఉండడంతో ప్రచారానికి మరింత పదును పెట్టింది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చేవెళ్ల లోక్‌సభపై గులాబీ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ తహతహలాడుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ సోమవారం ఈ ప్రాంతానికి రానున్నారు. వికారాబాద్‌లో కలెక్టరేట్‌ ఎదుట సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు శ్రేణులు ఏర్పాటు చేశాయి. ఈ సభను విజయవంతం చేయడానికి చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని ఆరుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. భారీ జన సమీకరణపై ప్రధానంగా  దృష్టి సారించారు. ఈ బాధ్యతలను కూడా ఎమ్మెల్యేలకే అప్పగించారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి సుమారు 25 వేల మందిని తరలించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మొత్తం 1.50 లక్షల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క బహిరంగ సభ ఏర్పాట్లను ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదివారం పరిశీలించారు. సభకు హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

నేతల ఉత్సాహం
టీఆర్‌ఎస్‌ పార్టీ ఫుల్‌ జోష్‌లో ఉంది. చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విస్తృతంగా పర్యటించారు. గత నెల 30న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ఈనెల 7వ తేదీతో ముగిశాయి. చేవెళ్ల, శేరిలింగంపల్లి, మహేశ్వరం, వికారాబాద్, పరిగి, తాండూరు, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో కేటీఆర్‌ రోడ్‌షోలు నిర్వహించి జనంలో ఉత్సాహం నింపే ప్రసంగాలు చేశారు. అంతేకాకుండా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కూడా చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చేవెళ్లలో గెలుపు కోసం నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈక్రమంలో సీఎం కేసీఆర్‌ రానుండటంతో ఆ పార్టీలో మరింత ఉత్సాహం నింపనుంది.

హామీలపైనే ఆశలు
గత ఐదేళ్ల కాలంలో లోక్‌సభ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరును బహిరంగ సభ వేదిక ద్వారా సీఎం కేసీఆర్‌ ఓటర్లకు వివరించనున్నారు. ప్రధానంగా స్థానిక సమస్యలైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కంది బోర్డు ఏర్పాటు తదితర వాటిపై స్పష్టత ఇచ్చే అవకాశముంది. దీనికితోడు నగర శివారులోని గ్రామాల అభివృద్ధికి ఆటంకంగా మారిన 111 జీఓని ప్రస్తావించే వీలుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరునెలల్లోనే ఈ జీఓను ఎత్తివేస్తామని సీఎం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారన్న అంశంపై స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జోగులాంబ జోన్‌లో కొనసాగుతున్న వికారాబాద్‌ను చార్మినార్‌ జోన్‌లో కలుపుతామని ఇప్పటికే కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఈవిషయంపైనా ముఖ్యమంత్రి మరోమారు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. జోన్‌ విషయంలో యువత, విద్యావంతులు, ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విద్యా, ఉద్యోగావకాశాల్లో కీలకమైన ఈ జోన్‌ అంశంపై గులాబీ బాస్‌ ఏం మాట్లాడుతారనే విషయం ఆసక్తిగా మారింది. దీంతోపాటు వికారాబాద్‌ను శాటిలైట్‌ టౌన్‌గా తీర్చిదిద్దడం, ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటు, విస్తృతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించే అంశంపై సీఎం ప్రసంగం సాగే అవకాశం మెండుగా ఉంది.

>
మరిన్ని వార్తలు