హైదరాబాద్‌ మేయర్‌కు ఆశాభంగం

7 Sep, 2018 12:38 IST|Sakshi
బొంతు రామ్మోహన్‌

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కోటిమంది జనాభా అవసరాలు తీర్చే జీహెచ్‌ఎంసీకి చర్లపల్లి డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఆయనను మేయర్‌ పదవి వరించడం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ పాలక మండలి గడువు ఐదేళ్లు ఉన్నప్పటికీ, ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, పోటీ చేసి అసెంబ్లీలో ప్రవేశించాలనేది ఆయన కోరిక.

ఈ క్రమంలో ఉప్పల్‌ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఆ నియోజకవర్గంలో అమలయ్యేలా చూసేవారు. భారీ ఫ్లై ఓవర్లు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి సైతం ఇటీవలే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. చెరువుల సుందరీకరణ నుంచి శ్మశానవాటికల అభివృద్ధి తదితర పనులపై దృష్టి సారించారు. నియోజకవర్గంలో ఎక్కువ అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా, ప్రజల మన్ననతో ఎమ్మెల్యేగా ఎన్నికై.. అన్నీ అనుకూలించి, అదృష్టం కలిసివస్తే మంత్రి కూడా కావచ్చని రాజకీయ వర్గాల్లోను ప్రచారం జరిగింది.

మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం కూడా అందుకు ఉపకరిస్తుందని పలువురు భావించారు. ఉప్పల్‌ నియోజకవర్గంపై ఆయన చూపెట్టిన శ్రద్ధను చూసి రాజకీయ వర్గాల్లోనే కాదు.. సర్కిల్‌లో పనిచేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు సైతం ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఖాయమని భావించారు. కానీ.. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన జాబితాలో ఉప్పల్‌ అభ్యర్థిగా హబ్సిగూడ డివిజన్‌ కార్పొరేటర్‌ బేతి స్వప్నారెడ్డి భర్త సుభాష్‌రెడ్డి ఉన్నారు. ఆయన ఆ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా ఉండటం తెలిసిందే. దీంతో మేయర్‌ ఆశలు ఆవిరయ్యాయి.

>
మరిన్ని వార్తలు