కరోనాతో గాబరా వద్దు!

15 Mar, 2020 04:33 IST|Sakshi

శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌

కోవిడ్‌తో భయపడాల్సిన పరిస్థితి లేదు

ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటది

ఉత్పాతం వచ్చినా ఎదుర్కోవడానికి సర్వం సంసిద్ధమై ఉన్నాం

రూ. వెయ్యి కోట్లు కాదు.. అవసరమైతే 5 వేల కోట్లు ఇస్తా

ప్రపంచ వ్యాప్తంగా ఉత్పాత పరిస్థితి ఉంటే ప్రేక్షక పాత్ర తగదు

సాక్షి, హైదరాబాద్‌: ‘కోవిడ్‌తో మనకు ప్రమాదమేమీ లేదు. ఉత్పాతం ఏమీ వచ్చిపడలేదు. గాబరపడాల్సిన పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటది. అవసరమైన వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నరు. అన్ని రకాలుగా మన ఆరోగ్య శాఖ సంసిద్ధమై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చారు. ఎటువంటి ఉత్పాత పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమై ఉందని స్పష్టం చేశారు. ‘మన పిల్లలు, అమాయక ప్రజానీకాన్ని కాపాడుకోవడానికి పొరుగు రాష్ట్రాల తరహాలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది.

అనవసరంగా రిస్క్‌ తీసుకోకూడదు కాబట్టి ఏ చర్యలు తీసుకుంటే సబబుగా ఉంటది అనే విషయాన్ని చర్చించేందుకు కేబినెట్‌ సమావేశం నిర్వహించి నిర్ణయిస్తాం’అని ప్రకటించారు. ‘రాష్ట్రంలో కోవిడ్‌ ప్రభావం–తీసుకున్న చర్యలు’పై శాసనసభలో శనివారం నిర్వహించిన లఘు చర్చలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. మాట వరసకు గతంలో కోవిడ్‌–19 నివారణకు రూ.1000 కోట్లు ఇస్తా అన్నామని, అవసరమైతే రూ.5 వేల కోట్లయినా ఇస్తామని ప్రకటించారు. ‘కరోనా వైరస్‌ సంబంధించి మంత్రి ఈటల రాజేందర్‌ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నరు. 12 రోజుల నుంచి రోజువారీగా సమీక్షలు నిర్వహిస్తున్నరు. గాంధీ ఆస్పత్రిలో కరోనా వచ్చిన ఓ వ్యక్తికి నయం చేసి పంపించడం జరిగింది. ఇప్పటివరకు దేశంలో ఇద్దరే చనిపోయారు’అని సీఎం తెలిపారు.

మొన్నటి వరకు సమస్య లేదు..
‘శుక్రవారం రాత్రి 11.30 గంటలకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి శాంతికుమారితో మాట్లాడితే ఇప్పటికి మనం సేఫ్‌ అని అన్నరు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి పాజి టివ్‌ అని తేలడం దురదృష్టకరం. గాంధీలో ఉంచి చికిత్స చేస్తున్నం. ప్రాథమికంగా మరో ఇద్దరికి వ్యాధి సోకినట్టు అనుమానిస్తున్నరు. వైద్య పరీక్షల కోసం నమూనాలు సేకరించి పుణేకు పంపించిండ్రు. ఈ ముగ్గురూ బయట దేశాల నుంచి వచ్చినవాళ్లే. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పాతస్థితి ఉన్నప్పుడు మనం ప్రేక్షక పాత్ర వహించలేం. వహిస్తే నేరం అవుతుంది. మొన్నటి వరకు మనకు ఆ సమస్య, ప్రమాదం లేదు. అనుకోకుండా ఒక కేసు పాజిటివ్‌గా రావడం, మరో ఇద్దరు అనుమానితులు ఉండటం తాజా పరిణామాలు’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

పొరుగు రాష్ట్రాల బాటలో...
‘ముందుజాగత్త్ర చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశ రాజధానిలో స్కూల్స్, మాల్స్‌ మూసివేసింది. బెంగళూరులో పెళ్లిళ్లు, బర్త్‌డేలు వాయిదా వేయించే అధికారాన్ని కలెక్టర్లకు అక్కడి ప్రభుత్వం ఇచ్చింది. కుటుంబ కార్యక్రమాలు ఇంటి వరకే చేసుకోవాలి. మహారాష్ట్ర, ముంబై, పుణే, భువనేశ్వర్, బెంగళూరులో భవిష్యత్తు కార్యాచరణపై అక్కడి ప్రభుత్వాలు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మనం కూడా మున్ముందు తీసుకోవాల్సిన చర్యలపై చీఫ్‌ సెక్రటరీ, హెల్త్‌ సెక్రటరీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు’అని సీఎం తెలిపారు.

వచ్చిన వారిని వచ్చినట్లే స్క్రీనింగ్‌...
‘కరోనా తీవ్రత అధికంగా ఉన్న చైనా, దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్‌ దేశాల నుంచి విదేశీ ప్రయాణికులను మన దేశంలోకి అనుమతించవద్దని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌–19 నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ దేశాల నుంచి మన దేశస్తులు తిరిగి వస్తే వారిని విమానాశ్రయం లో దిగిన వెంటనే 14 రోజులు క్వారంటైన్‌ (జనంతో దూరంగా ఉంచడం) చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. వారికి వ్యాధి లేదని తేలితే ఇంటికి పంపిస్తం. లేకుంటే చికిత్స అందిస్తం. వచ్చేవాళ్లు ఏ దేశం నుంచి ఏ దేశం వెళ్లి వస్తారో తెలియదు. ఈ 7 దేశాల నుంచి నగరానికి నేరుగా విమానాలు లేకపోయినా ఢిల్లీ, ముంబైలో దిగి హైదరాబాద్‌కు రావచ్చు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని వారం రోజుల నుంచే అప్రమత్తమై ఉన్నం. 200 మంది ఆరోగ్య శాఖ సిబ్బందిని ఎయిర్‌పోర్టులో ఉంచినం. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీతో కలసి వచ్చిన వారిని వచ్చినట్టే స్క్రీనింగ్‌ చేస్తున్నరు. చెప్తే ప్రజలు భయపడ్తరని ఈ విషయాలు చెప్తలేం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో శుక్రవారం ఒక కమిటీ వేసినం. డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్నరు’అని కేసీఆర్‌ వెల్లడించారు.

అంతర్జాతీయ కనెక్టివిటీ పెరిగింది
హైదరాబాద్‌కు పెరిగిన అంతర్జాతీయ కనెక్టివిటీని, కోవిడ్‌ వ్యాప్తికి ఉన్న అవకాశాలను సీఎం సభలో వివరించారు. ‘శంషాబాద్‌ విమానాశ్రయానికి రద్దీ బాగా పెరిగింది. హైదరాబాద్‌ మెట్రో రైలులో కూడా అంచనాలకు మించి రోజుకు 4 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నరు. 2013–14లో రోజుకు సగటున 88 లక్షల ప్రయాణికులు నగరానికి వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 2.17 కోట్లకు పెరిగింది. శంషాబాద్‌ విమానాశ్రయానికి అప్పట్లో రోజుకి 23 వేల మంది వస్తే.. ఇప్పుడు 57 వేల మంది వస్తున్నరు’ అని కేసీఆర్‌ చెప్పారు.

భయంకరమైన కరోనా కాంగ్రెస్‌ పార్టీనే..
దేశానికి పట్టిన భయంకరమైన కరోనా కాంగ్రెస్‌ పార్టీనే అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘కోవిడ్‌తో వచ్చే జ్వరం మామూలు పారాసిటమాల్‌ వేసుకుంటే పోతదని ఓ సైంటిస్టు నాతో చెప్పిన విషయాన్ని చెప్పిన. దీనిని పట్టుకుని రాజకీయం చేస్తున్నరు’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొంత మంది మిత్రులు ప్రతి దాన్ని రాజకీయం చేస్తరు. అది వారి ఖర్మ. కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదని అనడం చాలా దుర్మార్గం. ఒక రాజు గారి రాజ్యంలో గత్తర(కలర)తో 50 వేల మంది చనిపోయిన్రు. పెద్ద భూత వైద్యుడున్నడు.. ఈ మహమ్మారిని తరిమేస్తడని సలహా ఇస్తే ఆయన్ని రాజుగారు పిలిపించిండు. ఆ భూతవైద్యుడు ఊరిపొలిమెరళ నుంచి వస్తుంటే భయపడి ఆ మహమ్మారి బయటకు వెళ్లపోసాగింది.

ఏమే 50 వేల మందిని సంపినవ్‌ కదా అన్యాయంగా అని భూతవైద్యుడు అంటే.. లేదు నేను 5 వేల మందినే సంపిన.. మిగిలిన 45 వేల మంది ఉత్తి భయానికే చనిపోయారు అని ఆ మహమ్మారి అందట’అని ఓ కథను ఉదాహరణగా వినిపించారు. మీరంతా సస్తరని బాధ్యత ఉన్నవాళ్లు ప్రజలతో చెప్తరా? అని ప్రశ్నించారు. కేంద్రం చాలా అప్రమత్తంగా ఉండి ఏం చేయాలో అన్ని చేస్తున్నది, 130 కోట్ల మంది ప్రజలు నివసించే దేశంలో అకస్మాత్తుగా అన్ని బంద్‌ చేస్తే ప్రజలు ఎంత భయపడాలి అని అన్నారు. సీఎం వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేయగా, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదని సీఎం సూచించారు. ‘శవాల మీద పేలాలు ఏరుకోవద్దని చెప్తున్నం.

సమాజాన్ని భయభ్రాంతులను చేయవద్దని చెప్తున్నం. ఎందుకు అనవసరంగా ఓ బస్తీ పేరు, ఓల్డ్‌ సిటీ పేరు చెప్పి బద్నాం చేయాలి? మేము ఎన్ని చర్యలు తీసుకున్నమో జాబితా చెప్పాలా? విదేశాల నుంచి వచ్చే వారిని కొరెంటైన్‌ చేయడానికి దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో 150 పడకలు ఏర్పాటు చేసినం, వికారాబాద్‌ హరిత టూరిజం ప్లాజాలో 30 సూట్స్‌ తీసుకున్నం. ఇంకా చాలా చాలా తీసుకున్నం. ఇవన్నీ చెప్పి భయభ్రాంతుల్ని చేయాల్సిన అవసరం లేదు. కెనడా ప్రధాని భార్యకు వ్యాధి సొకితే ప్రజలు భయపడ్తరని ఆయన నాలుగైదు రోజుల తర్వాత ప్రకటన చేశారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరూ అప్రమత్తంగా ఉన్నరు. పంజాబ్, రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నయి. ఒక్కో దేశంలో వందలు వేల మంది చనిపోతున్నరు. అమెరికాలో కిరాణం సామాన్లు దొరకడం లేదని అత్యయిక పరిస్థితి ప్రకటించారు. మన దగ్గర ఇద్దరే చనిపోయారు. 65 మందికే వ్యాధి వచ్చింది. 6 వేల మందికి వచ్చింది అనాలా? ’అని సీఎం ప్రశ్నించారు. 

>
మరిన్ని వార్తలు