దేశ గమనాన్ని, గతిని మారుస్తా: కేసీఆర్‌

1 Apr, 2019 20:58 IST|Sakshi

సాక్షి, గోదావరిఖని: దేశంలో ప్రబలమైన గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలివిలేని వ్యక్తులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారని.. కాంగ్రెస్‌, బీజేపీలతో దేశానికి ఒరిగేదేమీ లేదని విమర్శించారు. తాగునీటి సమస్య, కరెంట్‌ కటకట ఇంకా ఎందుకు ఉన్నాయని చర్చకు రమ్మంటే రాకుండా వ్యక్తిగతమైన నిందారోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బొగ్గుగనిలో పనిచేసే కార్మికులు సైన్యం కంటే తక్కువ కాదని, వారికి ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా మోదీ సర్కారు పట్టించుకోలేదన్నారు.

దేశంలో పన్నుల పద్ధతి బాలేదు కాబట్టే ఆదాయ పన్ను ఎగవేతలు ఎక్కువయ్యాయని తెలిపారు. 30 శాతం పన్ను కారణంగానే ఎగవేతలు పెచ్చుమీరుతున్నాయని, దీంతో నల్లధనం పేరుకుపోతోందన్నారు. తెలివిగల దేశాలు నల్లధనం మార్కెట్లోకి తేవాలన్నారు. మనదేశంలో స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం లోపభూయిష్టంగా ఉందన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారిని 70 శాతం పన్ను కట్టమంటున్నారని, 30 శాతమే కట్టనివాళ్లు.. 70 శాతం ఎలా కడతారన్న కనీస అవగాహన పాలకులకు లేకుండా పోయిందని చురక అంటించారు. ఇండోనేషియా కేవలం నాలుగు శాతం పన్ను కట్టమంటే 24 లక్షల కోట్ల రూపాయలు వాళ్ల మార్కెట్లోకి వచ్చాయని వెల్లడించారు. చిన్న దేశానికే అంత డబ్బు వస్తే మన దేశంలో ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేస్తే ఎన్ని లక్షల కోట్లు వస్తాయో ఆలోచించాలన్నారు.

‘రిజర్వ్ బ్యాంకు దగ్గర 14 లక్షల కోట్ల వరకు మూలుగుతున్నాయి. మహారత్న కంపెనీల వద్ద మరో 12 లక్షల కోట్లు మూలుగుతున్నాయి. వాటిని వాడే తెలివి లేదు. దాదాపు రూ. 25 లక్షల కోట్లు వృధాగా పడివున్నాయి. వీటిని వాడరు. ఈ అంశం గురించి చర్చ పెట్టరు. ఈ దేశం అన్ని రంగాల్లో ముందుకు పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అత్యధికంగా యువకులు ఉన్న దేశం భారతదేశం. పని చేసేవారు, నీళ్లు నిధులు, యువశక్తి అన్నీ ఉండీ ఈ సన్నాసుల పరిపాలన వల్ల దేశం దెబ్బ తింటున్నది. అవసరానికి మించి కరెంట్‌ ఉంటే సగం కూడా వాడే తెలివిలేదు. సగం దేశం చీకట్లోనే ఉంటుంది. ఉన్న వనరులు, అవకాశాలు వాడలేని వాళ్లు పాలకులుగా పనికొస్తారా? కాంగ్రెస్‌, బీజేపీ పట్ల ప్రజలు విముఖత చెందార’ని కేసీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు పూర్తి మెజారిటీ రాదన్నారు. ప్రాంతీయ పార్టీల కూటమే దేశాన్ని శాసించనుందని తెలిపారు. తనను దీవిస్తే ఈ దేశ గతిని, దిశను మారుస్తానని చెప్పారు.

మరిన్ని వార్తలు