అలాంటి భారత దేశం కావాలి: కేసీఆర్‌

7 Apr, 2019 19:26 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌: నరేంద్ర మోదీ అంత అధ్వామైన ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. విధానాల గురించి మాట్లాడకుండా, వ్యక్తిగత విమర్శలు చేయడం మోదీకి అలవాటని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే హిందువులు, ముస్లింల మధ్య గొడవలు పెడుతున్నారని ఆరోపించారు. కులాల కుళ్లు, మతాల చిల్లర పంచాయతీ లేని దేశం కావాలని ఆకాంక్షించారు. యువత ప్రచార హోరులో కొట్టుకుపోకుండా మతాల మధ్య చిచ్చుపెట్టే నాయకులకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దళితులు, గిరిజనులు, మహిళలను గౌరవించినప్పుడు దేశం పురోగామిస్తుందన్నారు. అన్ని మతాలు, కులాలు, వర్గాల ప్రజలు సమాన హోదా, గౌరవంతో బతికే భారత్‌ దేశం కావాలన్నారు. ప్రజలు పరస్పరం ప్రేమించుకునే భారత్‌ దేశం కావాలన్నారు.

దేశంలో 3 లక్షల 50 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంటే అధ్వాన్న విధానాల కారణంగా 2 లక్షల 20 వేల మెగావాట్లకు మించి వాడలేదని వెల్లడించారు. 70 వేల టీఎంసీ నీళ్లు ఉన్నా వాటిని వాడే తెలివి కేంద్రానికి లేదన్నారు. పసుపు బోర్డు కోసం ఐదేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందు ఉందని, జూన్‌ తర్వాత దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్నట్టు కేసీఆర్‌ చెప్పారు. దేశానికి కూడా ఎజెండా సెట్‌ చేయాలన్నారు. 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తే జాతీయ స్థాయిలో మన పాత్ర పెరుగుతుందన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముందన్నారు. దేశానికి దశ, దిశ చూపించాలన్న ఉద్దేశంతోనే ఫెడరల్‌ ఫ్రంట్‌ను ప్రస్తావించానని తెలిపారు.

మరిన్ని వార్తలు