సారొస్తారా..?

23 Feb, 2018 10:46 IST|Sakshi
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

27న సీఎం సింగరేణి పర్యటనపై ఊహాగానాలు

శ్రీరాంపూర్‌లోనే సీఎం పర్యటన, సభ జరిగే అవకాశం

కారుణ్య నియమకాలు, ఇంటి రుణంపై స్పష్టత

టీబీజీకేఎస్‌ కమిటీని     ప్రకటించే అవకాశం

గుర్తింపు యూనియన్‌     నాయకుల హడావుడి

టూర్‌ ఖరారు కాలేదన్న ఎంపీ బాల్క సుమన్‌

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సింగరేణి కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హామీల అమలు శుభవార్త త్వరలోనే అందనున్నట్లు తెలిసింది. సింగరేణి ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా రానున్నట్లు సమాచారం. ఈనెల 27వ తేదీన సీఎం శ్రీరాంపూర్‌ వస్తున్నట్లు  కోల్‌బెల్ట్‌లో విస్తృత ప్రచారం జరుగుతోంది. సీఎం çపర్యటన, సభల కోసం యూనియన్‌ నాయకుల హడావుడి మొదలైంది. సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక యూనియన్‌ టీబీజీకేఎస్‌ గెలిచి నాలుగు నెలలు దాటింది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన కీలక హామీలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పురోగతి పురోగతి లేదు. కార్మికులు ప్రధానంగా ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాల ఊసేలేదు. ఈలోగా ప్రతి నెలా కార్మికులు విరమణ పొందుతున్నారు. అలాగే నాలుగు నెలలుగా గుర్తింపు సంఘం కార్యవర్గ నిర్మాణం జరగలేదు. కార్మికులు ప్రశ్నించేందుకు గానీ, కార్మికులకు సమాధానం చెప్పేందుకు గానీ టీబీజీకేఎస్‌ నుంచి ప్రతినిధి లేకుండా పోయాడు. ఈ పరిస్థితుల్లో సింగరేణిలో కార్మికలోకంలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందని ఇంటిలిజెన్స్‌ నివేదికలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో 27వ తేదీన శ్రీరాంపూర్‌ బొగ్గు గనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించనున్నట్లు సమాచారం. ఈ మేరకు సింగరేణి రామగుండం, బెల్లంపల్లి డివిజన్‌లలోని కార్మిక నాయకులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. కాగా సీఎం పర్యటన తేదీ అధికారికంగా ఖరారు కాలేదని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ ‘సాక్షి’తో చెప్పారు.

26న కరీంనగర్‌లో రైతు సమితి ప్రాంతీయ సదస్సు
రైతు సమితుల ఉత్తర తెలంగాణ ప్రాంతీయ సదస్సును ఈనెల 26న కరీంనగర్‌లో నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ పాల్గొనే ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రైతు సమితి ప్రాంతీయ సదస్సు ముగిసిన తరువాత ఆరోజు సీఎం కరీంనగర్‌లోనే బస చేసి 27న శ్రీరాంపూర్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరీంనగర్‌ çసదస్సు అనంతరమే శ్రీరాంపూర్‌ పర్యటన ఉంటుందని అనుకున్నప్పటికీ సమయాభావం వల్ల 27వ తేదీకి మార్చినట్లు ప్రచారం జరుగుతోంది.  

తుది దశకు కారుణ్య నియమకాల ఉత్తర్వులు..
సీఎం హామీల్లో ప్రధానమైన కారుణ్య నియామకాల ఉత్తర్వుల కూర్పు తుది దశకు చేరినట్లు తెలిసింది. దీనిపై యాజమాన్యం ఉత్తర్వులు ఇది వరకే సిద్ధం చేసి, న్యాయసలహా కోసం అడ్వకేట్‌ జనరల్‌కు పంపిం చారు. అక్కడినుంచి కొన్ని మార్పులు చేర్పులతో తిరిగి ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. ఈ రెండు మూడు రోజుల్లో పూర్తి ఉత్తర్వులు సిద్ధం కానున్నాయి. కేసీఆర్‌ శ్రీరాంపూర్‌ పర్యటన ఖరారైతే ఈ ఉత్వర్వులను ఇక్కడినుంచే విడుదల చేయనున్నట్లు తెలిసింది. మెడికల్‌ గ్రౌండ్‌ ఆధారంగా కారుణ్య నియామకాల పేరుతో వారసత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్లు సమాచారం. సర్వీస్‌ నిబంధన, జబ్బుల వివరాలు బయటికి తెలియకుండా అధికారులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు.

ఇంటి రుణంపై స్పష్టత
కార్మికుల సొంతింటి నిర్మాణం కోసం రూ.10 లక్షల వడ్డీ లేని రుణం మంజూరు చేయనున్నట్లు కూడా సింగరేణి ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. వడ్డీలేని రుణాన్ని కార్మికులకు ఎలా మంజూరు చేయవచ్చుననే అంశంపై యాజమాన్యం బ్యాంకర్లతో సమావేశమై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు విధి విధానాలపై యాజమాన్యం స్పష్టత ఇచ్చి దాన్ని కూడా సీఎం చేతుల మీదుగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

కొత్త గనుల ప్రారంభం సైతం...
సింగరేణి కంపెనీ వ్యాప్తంగా కొత్తగా ఆరు భూగర్భ గనులు ప్రారంభించేందుకు చాలా రోజులుగా సన్నాహాలు చేస్తున్న యాజమాన్యం వాటికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమిపూజ చేయించే యోచనతో ఉంది. ముఖ్యమంత్రి పర్యటన ఖరారైతే పనిలో పనిగా కొత్త గనులను కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు.

టీబీజీకేఎస్‌ కమిటీ కూర్పు పూర్తి
ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న టీబీజీకేఎస్‌ కేంద్ర కమిటీ కూర్పు కూడా తదిదశలో ఉన్నట్లు తెలిసింది. కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంటి కీలక పదవులు ఎవరికి ఇవ్వాలో ఇప్పటికే ఓ డ్రాఫ్ట్‌ను పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కవిత, ఇతర ముఖ్య నాయకులు రూపొందించి సీఎంకు సమర్పించినట్లు సమాచారం. గతంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులను పక్కనబెట్టి, పూర్తిగా టీఆర్‌ఎస్‌ పార్టీ పట్ల విధేయతతో ఉండే నాయకులకే పదవులు అప్పగించేలా డ్రాఫ్ట్‌ రూపొందించినట్లు తెలిసింది. శ్రీరాంపూర్‌లో సీఎం పర్యటన జరిగితే టీబీజీకేఎస్‌ కమిటీల ప్రకటన కూడా జరుగుతుందని తెలుస్తోంది. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు వేలాది మంది కార్మికులను సమీకరించాలని టీబీజీకేఎస్‌ యూనియన్‌ నేతలు నిర్ణయించినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు