సరయు నది ఒడ్డున భారీ రామ విగ్రహం

10 Oct, 2017 12:15 IST|Sakshi

సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ రాముడి విగ్రహాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేయబోతున్నారు. సరయు నది ఒడ్డున ‘నవ్య అయోధ్య’లో భాగంగా విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సన్నాహాలు ప్రారంభించబోతున్నారు. 

ఈ మేరకు గవర్నర్‌ రామ్‌ నాయక్‌కు పర్యాటక శాఖ ఓ ప్రతిపాదన పంపగా.. టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీ అవానిశ్‌ కుమార్‌ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారంట. సుమారు 100 మీటర్లు ఎత్తైన విగ్రహాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నప్పటికీ.. ఎత్తు విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అది ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఓ అధికారి తెలిపారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు పొందాక సరయుఘాట్‌ లో రాముడి విగ్రహ నిర్మాణ పనులు మొదలవుతాయని చెబుతున్నారు. అధికారికంగా ఎంత ఖర్చవుతుందో వెల్లడించలేదు.   

ఇదే సమావేశంలో దీపావళి పండగ సందర్భంగా నిర్వహించబోయే వేడుకల గురించి కూడా చర్చించినట్లు అధికారులు తెలిపారు. లక్ష దీపోత్సవంతోపాటు అయోధ్య వరకు శోభ యాత్ర నిర్వహించేందుకు ఆదిత్యానాథ్‌ సర్కార్‌ సిద్ధమౌతోంది. దేశ ఐక్యతకు చిహ్నంగా మోదీ పేర్కొంటూ ఉక్కు మనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అతిపెద్ద విగ్రహాన్ని నర్మదా నదీ తీరంలో నెలకొల్పబోతున్న విషయం తెలిసిందే. 182 మీటర్ల(597
అడుగులు) ఎత్తుతో 19వేల చదరపు కిలోమీటర్ల వ్యాసార్ధంలో 2500 కోట్ల భారీ ఖర్చుతో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతలు పెద్దదన్న మాట. ఈ విగ్రహం నిర్మాణానికి మూడు నుంచి మూడున్నర సంవత్సరాల సమయం పడుతుందని అంచనా.

మరిన్ని వార్తలు