అప్పుడలా..ఇప్పుడిలా

27 Apr, 2018 09:09 IST|Sakshi

ఉత్తర, దక్షిణ కర్ణాటక సంధానం కోసమే

బాదామిలో పోటీపై సీఎం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌

సాక్షి, బెంగళూరు: బాదామి నియోజకవర్గంలో పోటీ చేయడంపై సీఎం సిద్ధరామయ్య పలుసార్లు పలు రకాలుగా స్పందించారు. అసలు బాదామి నుంచి పోటీ చేస్తారా లేదా అనే ఊహగానాల నుంచి ప్రచారం నిర్వహించే వరకు వచ్చింది. అయితే బాదామి విషయంలో ఇప్పటికే అస్థిరత్వంగానే ఉన్నారు. ఆయన మాట తీరు దగ్గర నుంచి కార్యాచరణ వరకు అంత అయోమయంగానే సాగుతోంది. బాదామి విషయంలో రకరకాలుగా సిద్ధరామయ్య స్పందిచడం విశేషం. ఈ క్రమంలో తాజాగా బాదామిలో పోటీ చేయడంపై మాట్లాడుతూ... ఉత్తర, దక్షిణ కర్ణాటకలను కలిపేందుకే ఇక్కడ నిలుచున్నానని ప్రకటించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య అసమానతలను తొలగించేందుకు తన పోటీ చేస్తున్నట్లు.. ఇది ఒక ప్రయోగంగా తాను భావిస్తున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. గత పాలకులు రాష్ట్ర రాజధాని బెంగళూరుకు ఉత్తర కర్ణాటక ప్రాంతాలు దూరంగా ఉండడంతో అశ్రద్ధ వహించారని చెప్పారు. దక్షిణ కర్ణాటకతో పోలిస్తే ఉత్తరాది భాగంగా అంతగా అభివృద్ధి చెందలేదని తెలిపారు.

దీంతో ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు తమ పార్టీ బాదామి నుంచి పోటీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. మనం ఎక్కడ పుట్టినా అందరం కర్ణాటకకు చెందిన వారేనని తెలిపారు. అంతేకాకుండా చాముండేశ్వరిలో ఓడిపోతాననే భయంతోనే తాను బాదామిలో పోటీ చేస్తున్నట్లు బీజేపీ, జేడీఎస్‌లు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. అయితే తాను బాదామి ప్రజల పిలుపు మేరకు ఇక్కడ పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. అలా అయితే గతంలో మాజీ ముఖ్యమంత్రులు దేవెగౌడ, బంగారప్ప, ప్రస్తుత ప్రధాని మోదీ రెండు చోట్ల పోటీ చేశా>రని గుర్తు చేశారు. వాళ్లను ప్రశ్నించని నేతలు తన దగ్గరకు వచ్చేసరికి ప్రశ్నలు లేవనెత్తుతున్నారని చెప్పారు. మరోవైపు బాదామి విషయంలో సీఎం పలు సందర్భాల్లో పలు రకాలుగా మాట్లాడారు. ఒకసారి చాముండేశ్వరి నుంచి మాత్రమే పోటీ చేస్తానని, మరో సారి అధిష్టానం నిర్ణయమేనని, ఇంకోసారి బాదామి ప్రజలు పోటీ చేయాలని కోరుతున్నారని ఇలా పలు రకాలుగా పలు సందర్భాల్లో సీఎం వ్యాఖ్యానించారు.

పలు సందర్భాల్లో సీఎం వ్యాఖ్యలు..
2017, అక్టోబర్‌ 6– 2018 శాసనసభ ఎన్నికలే నా జీవితంలో చివరివి. చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేస్తాను.
2018, మార్చి 30–చాముండేశ్వరి నుంచే పోటీ చేస్తున్నాను. కుమారస్వామికి ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలి.
2018, ఏప్రిల్‌ 5– రెండు స్థానాల నుంచి పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
2018, ఏప్రిల్‌ 6– నాకు రాజకీయ జన్మనిచ్చిన చాముండేశ్వరి నుంచి మాత్రమే పోటీ చేస్తాను.
2018, ఏప్రిల్‌ 16–నా జీవితంలో రెండు స్థానాల నుంచి ఎప్పుడూ పోటీ చేయలేదు. ఇప్పుడు కూడా పోటీ చేయబోను. చాముండేశ్వరి నుంచి మాత్రమే బరిలో నిలబడుతాను.
2018, ఏప్రిల్‌ 18–అధిష్టానం నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఇప్పటికీ అదే మాటమీదే ఉన్నాను. రెండు స్థానాల నుంచి పోటీ చేయడంపై నాకు ఆసక్తి లేదు.
2018, ఏప్రిల్‌ 22–బాదామి నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది.
2018, ఏప్రిల్‌ 25–బాదామి నుంచి పోటీ చేయడం ద్వారా ప్రాంతీయ అసమానతలను తొలగించవచ్చు.

మరిన్ని వార్తలు