కోటా శిశు మరణాలపై దుమారం 

3 Jan, 2020 03:15 IST|Sakshi

ట్విట్టర్‌ వేదికగా ప్రియాంకపై ఆదిత్యనాథ్‌ ధ్వజం  

న్యూఢిల్లీ/లక్నో: రాజస్థాన్‌ కోటా జిల్లాలోని జేకే  లోన్‌ ప్రభుత్వాసుపత్రిలో కేవలం డిసెంబర్‌లో 100 మంది చిన్నారులు మృతి చెందడం రాజకీయంగా కలకలం రేపుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్‌ అ«ధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక మహిళలై ఉండి సాటి మహిళలపై సానుభూతి చూపించడం లేదంటూ యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ ధ్వజమెత్తారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూపీలో నిరసనలు చేసిన ప్రియాంక గాంధీకి తల్లుల బాధ కనబడకపోవడం విచారకరమని అన్నారు. యూపీలో రాజకీయాలు చేసే బదులుగా రాజస్థాన్‌కు వెళ్లి మృతి చెందిన చిన్నారుల తల్లుల్ని పరామర్శించి వారికి అండగా ఉండాలని సలహా ఇచ్చారు. వారిద్దరినీ లక్ష్యంగా చేస్తూ ఆదిత్యనాథ్‌ వరస ట్వీట్లు చేశారు. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా 100 మంది చిన్నారులు మృతి చెందినా ప్రియాంక పెదవి విప్పకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు.  ఈ అంశంపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌æ ట్విట్టర్‌లో కౌంటర్‌ ఇచ్చారు. శిశు మరణాలు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయన్నారు. తల్లీ బిడ్డల ఆరోగ్యమే తమకు ప్రధానమని స్పష్టం చేశారు.  

ఆస్పత్రికి నేడు కేంద్రం అత్యున్నత బృందం  
ఆస్పత్రిలో మరిన్ని శిశు మరణాలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యల తీసుకోవడానికి కేంద్రం నడుం బిగించింది. ఆరోగ్య నిపుణులతో కూడిన ఒక అత్యున్నత స్థాయి బృందాన్ని  జేకే లోన్‌ ఆస్పత్రికి పంపింది. కేంద్ర బృందం శుక్రవారం శిశు మరణాలకు గల కారణాలను, ఆస్పత్రిలో ఉన్న మౌలిక సదుపాయాల్ని అంచనా వేస్తుంది. బృందంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిపుణులు, జోధ్‌పూర్‌లో ఎయిమ్స్‌కి చెందిన వైద్యులూ ఉన్నారు. 

మరిన్ని వార్తలు