ఎన్ని రోజులైనా రెడీ..

17 Jun, 2020 05:30 IST|Sakshi
బీఏసీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

అసెంబ్లీ సమావేశాలపై సీఎం వైఎస్‌ జగన్‌

బీఏసీలో డ్రామాలాడి వెనక్కి తగ్గిన టీడీపీ 

ఉభయ సభలూ రెండు రోజులకే కుదింపు 

సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై బీఏసీలో టీడీపీ డ్రామాలాడింది. వర్చువల్‌ సమావేశాలు నిర్వహించాలంటూ ఆచరణ సాధ్యంకాని ప్రతిపాదన చేసి చివరికి వెనక్కి తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శాసనసభ సమావేశాలు క్లుప్తంగా రెండు రోజులు మాత్రమే నిర్వహించడానికి వీలవుతుందని బీఏసీలో అధికారపక్షం ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే టీడీపీ తరఫున హాజరైన నిమ్మల రామానాయుడు 15 రోజులు జరపాలంటూ డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌ ప్రమాదం ఉన్న తరుణంలో రెండు రోజులకు మించి సభ నిర్వహించడం మంచిది కాదని తాము భావిస్తున్నామని ఒక వేళ టీడీపీ కనుక డిమాండ్‌ చేస్తే 40 కాదు, 50 రోజులైనా, ఎన్ని రోజులైనా అసెంబ్లీ నిర్వహణకు సిద్ధమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని తెలిసింది.

తాము ఈ ఏడాది కాలంలో ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టామని, 3.98 కోట్ల మందికి రూ. 42 వేల కోట్లు వివిధ పథకాల ద్వారా నేరుగా నగదును బదిలీ చేశామని, అసెంబ్లీ ఎక్కువ రోజులు జరిగితే ప్రభుత్వం తరఫున తాము ఇవన్నీ చెప్పుకోవడానికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికీ వీలవుతుందని సీఎం అన్నారు. అయినా సరే తాము రెండు రోజులే చాలని భావిస్తున్నామన్నారు. ‘టీడీపీ కోరితే ఎన్ని రోజులైనా నిర్వహిస్తాం. కానీ వర్చువల్‌ అసెంబ్లీ మాత్రం సాధ్యం కాదు, దీనిపై పార్లమెంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అక్కడి నుంచి ఏం మార్గదర్శకాలు ఉంటాయో కూడా తెలియదు..’ అని సీఎం చెప్పినట్లు తెలిసింది.

ఈ సమయంలో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు వర్చువల్‌ అసెంబ్లీ నిర్వహణకు సౌకర్యాలు లేవని తెలిపారు. దాంతో రామానాయుడు ఏమీ మాట్లాడకుండా వెనక్కి తగ్గారు. మంత్రి కన్నబాబు జోక్యం చేసుకుంటూ టీడీపీ నేత జూమ్‌లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడా అలాగే జరగాలంటే కుదురుతుందా అని ఛలోక్తి విసిరారు. కాగా బయట మీడియాతో మాట్లాడిన రామానాయుడు.. తాము 15 రోజులు సమావేశాలు నిర్వహించాలంటే అధికారపక్షం అంగీకరించలేదని అన్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మండలి కూడా రెండు రోజులే....
శాసనమండలి చైర్మన్‌ ఎం.ఏ.షరీఫ్‌ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో కూడా మండలిని రెండు రోజుల పాటు నిర్వహించాలని ఖరారు చేశారు. ఎక్కువ రోజులు నిర్వహించాలని టీడీపీ ఇక్కడ కూడా కోరింది. బీజేపీ కూడా మరిన్ని రోజులు సమావేశం నిర్వహించాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు