మీపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది : సీఎం జగన్‌

8 Jun, 2019 10:53 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టారు. వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం సహా అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, అధికారులు పూర్తిగా సహకరిస్తేనే ప్రజల-ప్రభుత్వ కల సాకారం అవుతుందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు అధికారులు పూర్తిస్థాయిలో పనిచేస్తారని, ఈ విషయంలో తాను విశ్వాసంతో ఉన్నారన్నారు. అధికారులు తమకు ఉన్న పూర్తి అవగాహనతో.. అవినీతిని నిర్మూలించడంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

సీబీఐ రావడంలో అభ్యంతరం ఏమిటి..
‘ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆదరించారంటే వాళ్లకు మాపై ఎన్నో ఆశలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా పాలించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ప్రణాళిక (మేనిఫెస్టో) అందరికి మార్గదర్శనం కావాలి. దీనిలో ప్రకటించిన అంశాలు అందరు అధికారులకు దిక్సూచి కావాలి. గతంలో మేనిఫెస్టోలు చేసిన ప్రభుత్వాలు.. వాటిని ఎంతవరకు అమలు చేశాయో చూపడానికే వెనుకంజ వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ వివిధ విభాగాధిపతులు, కార్యదర్శులు, సీనియర్ అధికారులు ఉన్నారు. పారదర్శక పాలన అందించేందుకు మీ తోడ్పాటు అవసరం. మీపై నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. అనవసర వ్యయాన్ని తగ్గించాలి. మంచి పని తీరు ప్రదర్శించే అధికారులను సన్మాన సత్కారాలతో గౌరవిస్తాను.

గతంలో కాంట్రాక్టులు అంటే కేవలం తమకు అనువైన వారికి అనుగుణంగానే విధానాలు రూపొందించిన పరిస్థితులు ఉండేవి... కాని ఇకపై ఆ పరిస్థితి ఉండదు. రివర్స్ టెండరింగ్‌కు వెళ్తాము. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసినప్పుడు స్పష్టంగా చెప్పాను. చేసే పనులను మీ ముందు పెడతాము.. జ్యుడిషల్ కమిషన్ వేయండని కోరాను. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. ఇక సీబీఐ ఇక్కడ విచారణకు రావడాన్ని ఎందుకు అడ్డుకోవాలి. మంచి పాలన అందించాలనే సంకల్పంతో ఉన్నాం... సీబీఐ రావడంలో అభ్యంతరం ఏమిటి?  క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేపట్టేందుకు గ్రామ వాలంటీర్లను నియమించుకుంటున్నాము. ప్రతీ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ పని చేస్తారు. గ్రామ సచివాలయం కేంద్రంగా వీరంతా పని చేస్తారు. పనులు పారదర్శకంగా, అందరికి పథకాలు ప్రయోజనాలు అందాలన్నదే ఈ విధానం లక్ష్యం’  అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో చేపట్టబోయే సంస్కరణల గురించి అధికారులకు వివరించారు.

చదవండి : సచివాలయంలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి

మేమంతా సిద్ధంగా ఉన్నాము : సీఎస్‌
సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత తమతో సమావేశమైన ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులైన అధికారుల సమాహారం ఉంది. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేయడానికి అధికారులంతా సిద్ధంగా ఉన్నారు. అనేక సవాళ్ళను సైతం ఎదుర్కొని మంచి పనితీరును ప్రదర్శించే ప్రతిభ ఇక్కడి అధికార యంత్రాంగానికి ఉంది. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలకు అనుగుణంగా పనిచేసే గొప్ప సామర్థ్యం ఉన్న అధికారులు ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.

ఆకాంక్షలు నెరవేరుస్తా : సీఎం వైఎస్‌ జగన్‌
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టిన సందర్భంగా.. ప్రజలు, దేవుడి ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందని సీఎం వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి.. వారి ఆకాంక్షలు నెరవేరుస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు