మోస్ట్‌ పాపులర్‌ సీఎం; మూడో స్థానంలో వైఎస్‌ జగన్‌

15 Aug, 2019 19:53 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రజా నాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రిగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మరో గౌరవం దక్కింది. వీడీపీ అసోసియేట్స్‌ నిర్వహించిన సర్వేలో మోస్ట్‌ పాపులర్‌ సీఎంల జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 71 శాతం మంది సీఎం జగన్‌ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు ‘దేశ్‌ కా మూడ్‌’ పేరిట చేపట్టిన సర్వేలో తేలినట్లు వీడీపీ అసోసియేట్స్‌ వెల్లడించింది. సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’  జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయని ఈ సందర్భంగా తేల్చింది.

ఈ క్రమంలో అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలను అమలు చేసేందుకు వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న కీలక నిర్ణయాలే ఆయన పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన నాటి నుంచే వివిధ సామాజిక వర్గాల అభివృద్ధికై ఆయన చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిందని పేర్కొంటున్నారు. ఇక ఈ సర్వేలో ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రథమ స్థానంలో ఉండగా,  తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ఐదో స్థానంలో నిలిచారు.

కాగా ప్రజా సంక్షేమానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగించేందుకు వైఎస్‌ జగన్‌ అనేక కష్టనష్టాలకోర్చి 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించి ప్రజా సమస్యల గురించి స్వయంగా తెలుసుకున్నారు. ఆ క్రమంలో హత్యాయత్నం వంటి ఘటనలు చోటుచేసుకున్నా, మడమ తిప్పక ప్రజాక్షేత్రంలోనే గడిపారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఏకంగా 151 శాసనసభ స్థానాలు, 23 లోక్‌సభ స్థానాలు సొంతం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు