మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్‌ జగన్‌

24 Jun, 2019 11:47 IST|Sakshi

మేనిఫెస్టో ప్రతి ఒక్క అధికారి దగ్గర ఉండాలి

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి

అవినీతిని, చట్ట వ్యతిరేక పనులను సహించవద్దు

ఎంతటి వారైనా ఉపేక్షించ వద్దు

అందరు కలిసి పనిచేస్తే ప్రజల ఆకాంక్ష నెరవేరుతోంది

జిల్లా కలెక్టర్ల సదస్సులో దిశానిర్ధేశం చేసిన వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : ‘మనం పాలకులం కాదు.. సేవకులం’ అని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి, కలెక్టర్‌, అధికారి దగ్గర ఉండాలని సూచించారు. మేనిఫెస్టో అన్నది ఓ భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాలన్నారు. సోమవారం ఆయన ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కలెక్టర్లు ఏ విధంగా పని చేయాలో తెలియజేశారు. పై స్థాయిలో తాను నిర్ణయాలు తీసుకుంటే.. కింది స్థాయిలో అమలు చేసేది కలక్టర్లేనని తెలిపారు. అందరం కలిసి పనిచేస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ఇంకా ఏమన్నారంటే..

చిరునవ్వుతో పలకరించాలి..
‘మేనిఫెస్టోను గొప్పగా అమలు చేస్తామని నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. నా ద్వారా మీకు అధికారం ఇచ్చారు. ఏపీ చరిత్రలో ఇంత మెజారిటీ ఇంతవరకు ఎవ్వరికీ ఇవ్వలేదు. ప్రజలు మనల్ని నమ్మారు కాబట్టి.. ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేయాలి. రేపటి ఎన్నికల్లో మేనిఫెస్టోను అమలు చేశామని చెప్పుకుని ఓట్లు అడగాలి. దీనికి మీ అందరి సహకారం అవసరం. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలది కీలక పాత్ర. రెండు లక్షల మంది ప్రజలు ఓట్లు వేస్తే వారు ఎమ్మెల్యేలు అయ్యారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవాలి. ఎమ్మెల్యేలు, ప్రజలు మీదగ్గరికి వచ్చినప్పుడు చిరునవ్వుతో పలకరించాలి. అవినీతి, దోపిడీ వ్యవహారాలు చేస్తే ఈ ప్రభుత్వం సహించదు. ఏ స్థాయిలో ఉన్న సరే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజాస్వామ్యానికి ఎమ్మెల్యేలు,అధికారులు రెండు కళ్లలాంటి వారు. కలెక్టర్లు ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వర్గాల్లోని ప్రతి అర్హుడిగా సంక్షేమపథకాలు అందించాలి. అందిచకపోతే దేవుడి దృష్టిలో తప్పు చేసిన వాళ్లం అవుతాం. ఈ వ్యవస్థలో వీరి ఆత్మగౌరవం పెరగాలి. వారు ఆర్థికంగా ఎదిగేలా మన ప్రతి అడుగు వారికి దగ్గరుండాలి. ఇందుకోసమే నవరత్నాలు ప్రకటించాం. 

మావాళ్లు చెప్పినా వినవద్దు..
కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు ఇవేవి చూడకుండా ఈ పథకాలు అందజేయాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేరాలి. మా పార్టీ ఎమ్మెల్యేలు ఇవ్వద్దంటే పట్టించుకోవద్దు. మనకు ఓటు వేయనివారికి కూడా మంచి చేయాలి. మనం చేసిన మంచితో వారు మళ్లీ ఓట్లేసేలా చేసుకోవాలి. ఎన్నికలయ్యేవరకే రాజకీయాలు.. ఎన్నికలయ్యాక అందరు మనవాళ్లే. పథకాలు అందరికీ అందించేందుకే గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఏర్పాటు చేస్తున్నాం.  

గ్రామ వాలంటీర్‌ అవినీతికి పాల్పడితే..
ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను తీసుకొస్తున్నాం. రెండు వేల మంది నివాసం ఉండే ప్రతిగ్రామంలో  గ్రామసచివాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యత ఆ వాలంటీర్‌ తీసుకుంటారు. ప్రతి సంక్షేమ పథకాన్ని డోర్‌ డెలివరీ చేస్తారు. ఇది చేసేటప్పుడు గ్రామ వాలంటీర్‌ అవినీతికి పాల్పడవద్దు. వివక్ష చూపవద్దు. ఇలా చేయవద్దని రూ.5వేల జీతం ఇస్తున్నాం. అవినీతికి పాల్పడితే నేరుగా సీఎం ఆఫీస్‌కు కాల్‌ చేయవచ్చు. నేరుగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. 50 ఇళ్ల పరిధే కాబట్టి విచారణకు పెద్దగా ఇబ్బంది ఏర్పడదు. తప్పు చేస్తే వెంటనే తొలగిస్తాం. ఇందులో ఏమాత్రం మొహమాటం పడవద్దని చెబుతున్నాను. ప్రభుత్వ యంత్రాగమంతా నిజాయితీగా పనిచేయాలి. గ్రామస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎక్కడా కూడా అవినీతి ఉండకూడదు. ప్రతి పనిలో పారదర్శకత కనిపించాలి. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు వ్యవస్థలో మార్పు రావాలి. దేశం మొత్తం మనవైపు చూడాలి. మన రాష్ట్రాన్ని నమూనగా తీసుకోవాలి.

చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి ఉండకూడదు..
ప్రజలు ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి, పనుల కోసం ప్రజలు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. మన పనితీరు ఆధారంగా ఓట్లు వేస్తారు. మనం మంచి చేస్తే మళ్లీ గెలుస్తాం. ఎంత పెద్దవాళ్లు చెప్పినా అక్రమాలు, ఇసుక రవాణా, పేకాట క్లబ్‌లను ప్రోత్సహించొద్దు. గత ప్రభుత్వంలో బర్త్, డెత్‌ సర్టిఫికెట్‌, రేషన్‌ కావాలన్న లంచం. జీవిత బీమా కోసం కూడా లంచాలు తీసుకున్నారు. చివరకు బాత్‌రూం మంజూరు కావాలన్నా లంచం అడిగారు. మన ప్రభుత్వంలో ప్రజలకు ఆ లంచాలిచ్చే పరిస్థితి ఉండకూడదు. ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగకూడదు. గ్రామస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. పైస్థాయిలో కాంట్రాక్ట్‌లు అంటేనే అవినీతనే స్థితికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకే రివర్స్‌ టెండరింగ్‌ను తీసుకొచ్చాం. ఎక్కడెక్కడ తప్పు జరిగిందో గుర్తించి రివర్స్‌ టెండరింగ్‌ వేస్తున్నాం. టెండరింగ్‌ ప్రీ క్వాలిఫికేషన్‌ను మారుస్తాం. చాలా మంది టెండరింగ్‌కు వచ్చేలా చేస్తాం. తక్కువ ఎవరైనా ఇస్తారా అని అడిగి మరి ఇస్తాం. ఏం మిగిలినా కూడా ప్రభుత్వానికి ఆదా చేస్తాం.’ అని సీఎం జగన్‌ కలెక్టర్లకు సూచించారు.
చదవండి: ‘ప్రజావేదిక’పై సీఎం జగన్‌ సంచలన నిర్ణయం 

మరిన్ని వార్తలు