చంద్రబాబు వైఖరి అన్యాయం: సీఎం జగన్‌

13 Jun, 2019 14:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: శాననసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరి అన్యాయంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంను సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష నాయకుడు రాకపోవడంతో సభలో ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తనను ఆహ్వానించనందునే రాలేదని, పిలవని పేరంటానికి ఎలా వస్తానని చంద్రబాబు అన్నారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. ప్రొటెం స్పీకర్‌ చినఅప్పలనాయుడు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించారని తెలిపారు. సాక్షాత్తు సభలో అందరిముందు జరిగిన ఘటనను చంద్రబాబు వక్రీకరిస్తున్నారని విమర్శించారు.

‘నాకు ఆశ్చర్యమనిపించింది ఏందంటే ప్రొటెం స్పీకర్‌ ఆహ్వానాన్ని మన్నించాల్సించిపోయి నాకు బొట్టు పెట్టలేదు, శాలువా కప్పలేదు అంటూ చంద్రబాబు మాట్లాడారు. ఆన్‌రికార్డుగా సాక్షాత్తూ మన కళ్లెదుటే జరిగిన ఘటనను వక్రీకరిస్తున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వాళ్ల సభ్యులతో ఏవేవో చెప్పిస్తున్నారు. ఒక అబద్దాన్ని నిజం చేసేందుకు వందసార్లు చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పిస్తున్నారు. రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఈవిధంగా వ్యవహరించడం సరికాదు. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి, అన్యాయంగా వ్యహరిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంతకన్నా సాగదీయడం ఇష్టలేదు, వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. (చూడండి: చంద్రబాబు, జగన్‌కు ఎంత తేడా?)

>
మరిన్ని వార్తలు