రసాభాసగా టిప్పు జయంతి వేడుకలు

11 Nov, 2018 03:55 IST|Sakshi
టిప్పు వ్యతిరేక నినాదాలిస్తున్న కార్యకర్తలు

ముఖ్య కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం దూరం

బీజేపీ, హిందూ సంస్థల ఆందోళనలు

బెంగళూరు: బీజేపీ, ఇతర హిందూ సంస్థల ఆందోళనల నడుమ 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలు శనివారం కర్ణాటకలో రసాభాసగా జరిగాయి. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి సీఎం కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి పరమేశ్వర రాలేదు. సీఎం ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం ముస్లిం వర్గాన్ని అవమానించడమేనని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు అన్నారు. అధికారిక కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎంలు డుమ్మాకొట్టడంపై ముస్లిం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తంచేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తన పార్టీకి పట్టున్న మైసూరు ప్రాంతంలో ఓటర్లను దూరం చేసుకోకూడదనే సీఎం ఈ కార్యక్రమానికి గైర్హాజరైనట్లు భావిస్తున్నారు. కానీ టిప్పు గొప్ప పాలకుడని, ఆయన సేవలు కొనియాడుతూ కుమారస్వామి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లోపోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. టిప్పు మతఛాందసవాది అని పేర్కొన్న బీజేపీ ఆయన జయంతి వేడుకల్ని నిలిపేయాలని ప్రభుత్వాన్ని కోరింది. బెంగళూరు, మంగళూరు, చిక్‌మగ్లూర్, బళ్లారి, కార్వార్‌ తదితర ప్రాంతాల్లో నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు